సోమవారం 25 మే 2020
Medak - Apr 10, 2020 , 02:42:00

వర్షం.. నష్టం

వర్షం.. నష్టం

  • వడగండ్ల వానతో నేలరాలిన పంటలు
  • నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులు  

ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌: ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా పలుచోట్ల కురిసిన వడగండ్ల వాన రైతులకు నష్టాన్ని మిగిల్చింది. మెదక్‌ జిల్లా రామాయంపేటతో పాటు కోమటిపల్లి, మండలంలోని తొనిగండ్ల గ్రామాల్లో భారీ వాన కురిసింది. తొనిగండ్ల గ్రామంలో 30 మంది రైతులకు చెందిన వరి పంట 28 ఎకరాల్లో వరి గింజలన్నీ నేలరాలాయి. కోమటిపల్లి గ్రామంతో బాటు రామాయంపేట పట్టణంలోని 20మంది రైతులకు చెందిన పంటపొలాల్లో వడగండ్ల వర్షం పడడంతో 27 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తెలిపారు. గురువారం వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించారు. వెల్దుర్తి మండలంలో దెబ్బతిన్న పంటను వ్యవసాయాధికారి మాలతి పరిశీలించారు.వివరాలను నమోదు చేసి నష్టం అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు ఆమె తెలిపారు. చిన్న శంకరంపేట మండలం ఎస్‌.కొండాపూర్‌, గవ్వలపల్లి, చందాపూర్‌, జంగరాయి గ్రామాల్లో 94మంది రైతులకు చెందిన 110ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఏవో శ్రీనివాస్‌ తెలిపారు.  పాపన్నపేట మండల పరిధిలోని దౌలాపూర్‌ పాపన్నపేట, కుర్తివాడ, యూసుఫ్‌పేట, మిన్‌పూర్‌, లింగాయపల్లి, అబ్లాపూర్‌, అన్నారం, పొడ్చన్‌పల్లి గ్రామాలలో 463 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు వ్యవసాయశాఖ అధికారి ప్రతాప్‌కుమార్‌ వెల్లడించారు. గురువారం మెదక్‌ ఏడీఏ నగేశ్‌ పాపన్నపేట మండల వ్యవసాయశాఖ అధికారి ప్రతాప్‌కుమార్‌ ఏఈవోలు రజిత, జనార్దన్‌, అభిలాష్‌తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు రైతులు నష్టపోయిన పంటలను పరిశీలించారు.  మెదక్‌ మండలంలో సుమారు 754 ఎకరాలలో వరిపంటకు నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు మండల వ్యవసాయధికారి ప్రవీణ్‌ తెలిపారు.  నర్సాపూర్‌ మండల పరిధిలోని రుస్తుంపేట్‌ గ్రామంలో 25 ఎకరాలు, రాంచంద్రపూర్‌ గ్రామంలో 29 ఎకరాలు మొత్తం 54 ఎకరాల్లో వరి పంటకు నష్టం  జరిగిందని  ఏవో వెంకటేశ్వర్లు  తెలిపారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంతో పాటు గురువన్నపేట, పొసాన్‌పల్లి, తపాస్‌పల్లి, ఐనాపూర్‌, మర్రిముచ్చాల, గౌరాయపల్లి, రాసూలాబాద్‌ గ్రామాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మర్రిముచ్చాల, గౌరాయపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది.  నంగునూరు మండలం సిద్దన్నపేట, ముండ్రాయి, వెంకటాపూర్‌, తిమ్మాయిపల్లి తదితర గ్రామాల్లో వడగండ్ల వానతో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, వ్యవసాయ అధికారి గీత, రైతుబంధు మండల అధ్యక్షుడు కిష్టారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. గజ్వేల్‌  మండల పరిధిలోని    పిడిచెడ్‌ గ్రామంలో కురిసిన వర్షానికి వరి పంట  దెబ్బతిన్నది.  కొండపాక మండలంలోని  బందారం, దర్గా, అంకిరెడ్డిపల్లి, దుద్దెడ తదితర గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది.  వడగండ్లతో వరి పంటకు నష్టం వాటిల్లింది.  మిరుదొడ్డి మండల పరిధిలోని ఆరెపల్లి, లక్ష్మీనగర్‌ గ్రామాల్లో గురువారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు  వడ్లు రాలి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట అర్బన్‌ పరిధిలోని రంగదాంపల్లిలో గురువారం సాయంత్రం కురిసిన వడగండ్ల వర్షంతో  వరిపంటలకు తీవ్ర నష్టం కలిగింది.  చేర్యాల మండలంలోని నాగపురి, కడవేర్గు, పెద్దరాజుపేట, పోతిరెడ్డిపల్లి, వేచరేణి, మద్దూరు మండలంలోని కమలాయపల్లి గ్రామాల్లో గురువారం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలలో భారీ వర్షం కురిసింది.నాగపురి గ్రామంలో కురాకుల మల్లయ్యకు చెందిన ఇంటి పై కప్పు లేచిపోవడంతో ఇంట్లో ఉన్న వస్తువులు తడిసిముద్దనైట్లు తెలిపారు.బలమైన గాలులకు పలు గ్రామాల్లో చెట్లు నేలకూలినట్లు గ్రామస్తులు తెలిపారు.


logo