పటాన్చెరు, ఆగస్టు 4: వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కూరగాయల మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేసింది. అక్టోబర్ రెండో తేదీన (2023లో) పటాన్చెరు కూరగాయల మార్కెట్లో రూ. 20.46 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసేందుకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో పాటు పలువురు శంకుస్థాపన చేయగా..ఈ కాంప్లెక్స్‌లో 168 షాపులు నిర్మిస్తున్నారు. మార్కెట్‌కు రోజూ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పండించిన ఉల్లిగడ్డ, కూరగాయలు విక్రయించేందుకు రైతులు వస్తారు. ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఆదాయం లక్ష్యం రూ. 7కోట్లుకాగా ప్రతి ఏడాది రూ.7 కోట్లు వసూలు చేస్తున్నారు.
పటాన్చెరులో కూరగాయల వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో రూ. 20.46 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. మార్కెటింగ్ ఇంజినీరింగ్ అధికారులు టెండర్లు పిలిచి పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తి పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదు.నిధులు లేక పాషింగ్ కాంప్లెక్స్ పనులు మధ్యలో నిలిచిపోయాయి.
మార్కెట్లో విశాలమైన స్థలం ఉంది. దీంతో మార్కెట్‌ను విస్తరించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేం దుకు కృషి చేసింది. పటాన్‌చెరుకు హైదరాబాద్ పట్టణం సమీపంలో ఉండడంతోపాటు గుడిమల్కాపూర్ మార్కెట్, బోయిన్పల్లి మార్కెట్ యార్డు, మలక్‌పేట గంజ్మార్కెట్ , కొత్తపేట మార్కెట్ తరహాల్లో అభివృద్ధి చేసేందుకు కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రాష్ట్రంలో రాజకీయ మార్పులు రావడంతో కాంప్లెక్స్ నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది. దీంతో వ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పటాన్చెరు కూరగాయల మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ పనులు పూర్తి చేయకపోవడంతో వ్యాపారులు తాత్కాలిక షెడ్లు నిర్మించుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. మార్కెటింగ్‌శాఖ ద్వారా 22 మందికి ట్రేడ్ లైసెన్స్, 308 మందికి కమీషన్ ఏజెంట్ల లైసెన్స్ జారీ చేసింది. తాత్కాలిక షెడ్లలో వ్యాపారులు కూరగాయలు కొనుగోలు, అమ్మకాలు చేస్తున్నారు. షాపులు లేక తాత్కాలిక షెడ్లు వేసుకొని వ్యాపారం చేయడం.. వర్షాలు పడిన సమయంలో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసంపూర్తిగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వ్యాపారులు కోరుతున్నారు. కూరగాయల అమ్మకాలు చేసేందుకు వచ్చిన రైతులకు విశ్రాంతి భవనం లేక ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. మార్కెట్లో సెక్యూరిటీ గార్డు లేక ఇబ్బందులు తప్పడం లేదని వ్యాపారులు వాపోయారు.
పటాన్చెరులో అసంపూర్తిగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. మార్కెటింగ్‌శాఖ నిధులతో పనులు చేస్తున్నారు. ప్రస్తుతం కాంప్లెక్స్ నిర్మించేందుకు నిధులు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. మార్కెట్లో సిబ్బంది కొరత ఉంది… ఉన్న సిబ్బందితో పనులు చేస్తున్నాం. రోజూ మార్కెట్‌కు 20 లారీల కూరగాయలు, రెండు లారీల ఉల్లిగడ్డలు వస్తాయి. మార్కెటింగ్‌శాఖ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. మార్కెట్ ఆదాయం పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి అనుమతిరాగానే అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేస్తాం.
– సయ్యద్ మహబూబ్, మార్కెటింగ్ కార్యదర్శి, పటాన్చెరు, సంగారెడ్డి జిల్లా