సిద్దిపేట, నవంబర్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పాలనలో దళారులు రాజ్యమేలుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చేయి తడిపితేనే పనులు అవుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధ్దిదారుల నుంచి దళారులు ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో చెక్కుకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు వసూలు చేస్తున్నారు. పేదింటి అడపిల్ల పెండ్లికి ఇబ్బంది కావద్దని బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారు. ఆడబిడ్డ పెండ్లికి ఈ పథకాల కింద ఆర్థికసాయం చెక్కులు అందించి కేసీఆర్ పెద్దన్నలాగ నిలిచారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కడుపునిండా భోజనం పెట్టి లబ్ధ్దిదారులకు చెక్కులను అందించేవారు. పండుగలా చెక్కుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించేవారు. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు పైసా ఖర్చు లేకుండా చెక్కులు రావడంతో లబ్ధిదారులు సంతోషించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అందుకు విరుద్ధ్దంగా పరిస్థితి తయారైంది.
ఏ చెక్కు కావాలన్నా డబ్బులు ముట్టజెప్పాల్సి వస్తున్నదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దళారుల బెడద ఎక్కువైంది. కార్యాలయాల్లో దళారుల రాజ్యం నడుస్తోంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులకు చేతికి అందాలంటే ఆ పేద కుటుంబాలు డబ్బులు ముట్టచెప్పాల్సి వస్తున్నది. ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పకోండి అంటూ దర్జాగా దళారులు సమాధానం ఇస్తున్నారు. మీరు ఇచ్చే డబ్బుల్లో అధికారులకు వాటాలు పోతాయి అని చెబుతున్నట్లు లబ్ధ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధ్దిదారులకు దళారులు బెడద తప్పడం లేదు. దళారులు అందినకాడికి దోచుకుంటున్నారు. ఒక్కో లబ్ధ్దిదారు వద్ద రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల దరఖాస్తుల జాబితాను స్థానిక తహసీల్ కార్యాలయ సిబ్బంది సహకారంతో దళారులు తీసుకొని లబ్ధిదారులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనే మీ ఫైల్ ముందుకు కదులుతుందని, లేకపోతే ఇక్కడే తహసీల్ కార్యాలయంలో ఆగిపోతుందని బెదిరిస్తున్నారు.
డబ్బులు ఇచ్చిన తర్వాత ఎవరికీ చెప్పవద్దని, అలా చెబితే మీ చెక్కు రాకుండా చేస్తామంటూ దళారులు దరఖాస్తుదారులను బెదరిస్తున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో దళారుల బెడద మరి ఎక్కువైంది. చెక్కు రాకముందు, చెక్కు వచ్చిన తర్వాత దళారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో దళారుల బెదడ ఎక్కువైందని ప్రజలు వాపోతున్నారు.
కల్యాణలక్ష్మి చెక్కు డబ్బులు తీసుకుంటున్నారని, ఇదేనా మీ పాలన అంటూ స్థానిక ఎమ్మెల్యేకు ఓ లబ్ధ్దిదారుడు మెసేజ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొద్దిసేపటికే ఆ మెసేజ్‌ను డిలీట్ చేశారు. ఇలా ఏ గ్రామంలో చూసినా దళారుల బెడద ఎక్కువైంది. ఇదే మండలంలో ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఆ కార్యకర్త ఆవేశంతో ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నాడు. ‘అన్నా.. మన పార్టీ ప్రభుత్వంలో ఉంది. నేను సీనియర్ కార్యకర్తను’ నావద్ద కూడా దళారులు డబ్బులు తీసుకునుడు ఏంది అన్నా’.. అంటూ మెసేజ్ పెట్టినట్లు సమాచారం.
ఇటీవల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి దళారులు అందినకాడికి డబ్బులు వసూలు చేస్తున్నారు.సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వసూలు రాజాలు పెరిగిపోయారు. ప్రతి పనికి ఏదో ఒక రకంగా డబ్బులు గుంజుడే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తును స్థానిక తహసీల్ కార్యాలయంలో లబ్ధ్దిదారుడు అప్పజెప్పాల్సి ఉంటుంది. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ స్థానిక తహసీల్దార్ లాగిన్లోకి వెళ్తుంది.
అక్కడ తహసీల్దార్ దానిని పరిశీలించి ఆర్డీవోకు పంపుతారు. ఇలా ప్రాసెస్ పూర్తి అయ్యాక లబ్ధ్దిదారుడికి పథకం మంజూరవుతుంది.కానీ, ఇక్కడే అసలు మోసం జరుగుతున్నది. అయా మండల కేంద్రాల్లోని తహసీల్ కార్యాలయ సిబ్బందితో కొంత మంది దళారులు కుమ్మకవుతున్నారు. తహసీల్ సిబ్బంది అండదండలతో కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుల జాబితాను దళారులు తీసుకుంటున్నారు.
ఆ జాబితా పట్టుకొని లబ్ధ్దిదారులకు ఫోన్లు చేసి మీరు కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు కదా..? చెక్కు మంజూరు కావాలంటే రూ. 10వేల నుంచి రూ. 15వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ వద్ద అంత డబ్బులు లేవని..ఇంక తమకు పథకం మంజూరు కాలేదని… ఇప్పుడే డబ్బు లు అడిగితే ఎలా అంటూ దరఖాస్తుదారులు ప్రశ్నిస్తే..? మీకు పథకం మంజూరు కోసమే రూ. 10 వేలు ఇవ్వమంటున్నాం…ఇప్పుడు డబ్బులు ఇస్తేనే మీ ఫైల్ ముందుకు పంపుతాము.
ఇది కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే పనులు అవుతాయి.. అంటూ బెదరిస్తున్నారు. చేసేది ఏమిలేక లబ్ధ్దిదారులు డబ్బులు ముట్ట జెబుతున్నారు. మంజూరు అయ్యాక చెక్ ఇచ్చే ముందు కూడా ఎంతో కొంత డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పనికి పైసా లేనిదే పనులు కావడం లేదని లబ్ధ్దిదారులు మొత్తుకుంటున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా వీటిని మంజూరు చేస్తామని చెప్పింది. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాక ముందే దళారులు గ్రామాల్లో బేరాలు కుదుర్చుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రొసీడింగ్‌లు తీసుకొని ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకున్న లబ్ధిదారుల ఇండ్లను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీరాగానే రద్దు చేసింది. దీంతో లబ్ధ్దిదారులు లబోదిబోమన్నారు. ఇల్లు మంజూరు కోసం దళారులను ఆశ్రయించి ఎంతోకొంత సమర్పించుకుంటున్నారు. ఇలా ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు అధికార పార్టీ నేతలు, దళారులపై ఆరోపణలు వస్తున్నాయి.