రామాయంపేట, మార్చి 15: అక్రమంగా ఓ వ్యాపారి కోళ్లదాణాను రైతుల నుంచి కొనుగోలు చేసిన సంఘటన నిజాంపేట మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. నిజాంపేట ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి వివరాల ప్రకారం.. నిజాంపేట మండల శివారులోని వెంకటేశ్వర హేచరీస్, రామాయంపేట స్నేహ చికెన్ వారు రైతులకు కోళ్లకు వేసే దాణాను అందజేశారు.
రైతులు తమ కోళ్లకు వేసేందుకు తీసుకున్న దాణాను దొంగచాటుగా విక్రయించారు. హేచరీస్ సంస్థకు చెందిన వారు వలపన్ని ఆటోల్లో తీసుకెళ్తున్న కోళ్లదాణాను పట్టుకున్నారు. కొద్ది రోజులుగా గుట్టుచప్పుడు గాకుండా నిజాంపేటకు చెందిన వ్యాపారి వైష్ణవి ట్రేడర్ ఆధినేత రవీందర్ రైతుల నుంచి దాణాను కొనుగోలు చేస్తున్నారు. ఫౌల్ట్రీ ఫాం యజమానులు రైతులకు ఉచితంగా ఈ కోళ్ల దాణా బస్తాలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సుమారు 109 బస్తాలను అక్రమంగా వ్యాపారి రవీందర్ కొనుగోలు చేశారని, ఒక్కో బస్తా రూ.3500 ధర ఉంటుందని వెంకటేశ్వర, స్నేహ చికెన్ నిర్వాహకులు తెలిపారు. తమ కోళ్ల ఫారాలకు చెందిన దాణాను అక్రమంగా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన వ్యాపారి రవీందర్‌పై నిజాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న నిజాంపేట ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి వ్యాపారి గోదాంను సీజ్ చేసినట్లు తెలిపారు. హేచరీస్‌కు సంబంధించిన రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు వ్యాపారి వైష్ణవి ట్రేడర్ రవీందర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నిజాంపేట ఎస్సై తెలిపారు.