
మెదక రూరల్, జూలై 7 : తెలంగాణ రాష్ట్రం పంట పొలాలతో కళకళలాడుతూ సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి, వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా బుధవారం మెదక్ మండలం బాలనగర్లో కలెక్టర్ హరీశ్, జడ్పీ ఉపాధ్యక్షురాలు లావణ్యరెడ్డి, వ్యవసాయఅధికారి పరశురాం నాయక్‌తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సూరిబాబు అనే రైతు పొలంలో వెద సాగులో భాగంగా వడ్లు చల్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వెద సాగుతో ఎకరాకు రూ.8 నుంచి రూ.10వేల పెట్టుబడి తగ్గడంతో పాటు నాటు వేసేందుకు కూలీల కొరతను అధిగమించొచ్చని సూచించారు. దిగుబడి కూడా ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్లు వస్తుందన్నారు. రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని సీఎం కేసీఆర్ గుర్తించి, అన్నదాత కోసం అనేక కార్యక్రమాలు తెచ్చి, పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నారన్నారు. రైతులు ప్రత్యామ్నాయంగా కంది, పత్తి వంటి వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపేలా చూడాలన్నారు. మన జిల్లా హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నందున మార్కెటింగ్‌కు చాలా అవకాశాలున్నాయని, ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకం పై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయాధికారులు రైతులతో మమేకమై ప ని చేస్తూ వారిలో నమ్మకం కలిగించాలన్నారు. అనంతరం నాగయ్య అనే రైతు పొలంలో దిగి, కూలీల ఆటాపాటల మ ధ్య వరినాట్లు వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీరాములు, ఎంపీపీ యమునాజయరాంరెడ్డి, సర్పంచ్ వికాస్, వైస్ ఎంపీపీ ఆంజనేయులు, వ్యవసాయాధికారులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతిలో నిర్లక్ష్యం వద్దు
పల్లె ప్రగతి కార్యక్రమంపై నిర్లక్ష్యం వహించొద్దని మెదక్ కలెక్టర్ హరీశ్ సూచించారు. బుధవారం నార్సింగి మండలం సంకాపూర్, జెప్తిశివునూర్, వల్లూర్, భీంరావ్పల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను సందర్శించారు. గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరియాలని, ప్రతి ఇంటి ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, ఇంటింటా మొక్కలు నాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండలప్రత్యేక అధికారి జగదీశ్, ఎంపీపీ చిందం సబిత, వైస్ ఎంపీపీ సుజాత, సర్పంచ్ ఆనందాస్ మహేశ్వరి, ఆర్ సుజాత, షరీఫ్, ఎంపీడీవో ఆనంద్మేరి, కార్యదర్శి అంజిరెడ్డి, మండల నాయకులు చిందం రవీందర్, నరేశ్ తదితరులున్నారు.