సిద్దిపేట కలెక్టర్ హనుమంతరావు
గజ్వేల్ రూరల్, ఫిబ్రవరి15: దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకే ప్రభుత్వం దళితబంధు పథకం అమలుచేస్తున్నదని సిద్దిపేట కలెక్టర్ హనుమంత రావు అన్నారు. మంగళవార గజ్వేల్ రూరల్ మండలంలోని కొల్గూర్లో దళతబంధు లబ్ధిదారులను కలిసిన ఆయన ఏ యూనిట్‌ను ఎంపిక చేసుకుంటున్నారు, ఎంపిక చేసుకున్న యూనిట్‌పై ఎలాంటి అవగాహన ఉందో అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎక్కువ మంది లబ్ధిదారులు ట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ దళితుల కోసం దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.10లక్షలు అందజేస్తుందన్నారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లతో ఆర్థికంగా అభివృద్ధి చెంది ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి రావాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి యూనిట్లను గ్రౌండింగ్ చేస్తామని, ఇప్పటికే అధికారులు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారన్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకొని ఆర్థికంగా పైకి రావాలని, అప్పుడే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందన్నారు. అవసరం ఉన్న వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా ఇస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, అదనపు డీఆర్డీవో కౌసల్యదేవి, ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణాశ్రీనివాస్, తహసీల్దార్ అబ్రహంలింకన్, ఎంపీడీవో రాజేశ్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, సర్పంచ్ రాజు, ఎంపీటీసీ జ్యోతిస్వామి పాల్గొన్నారు.