ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి
ఏరియా దవాఖానలో పండ్లు పంపిణీ
నారాయణఖేడ్‌లో డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపిక
70 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత
నారాయణఖేడ్, ఫిబ్రవరి 15: సీఎం కేసీఆర్ కారణ జన్ముడని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి కొనియాడారు. సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నారాయణ ఖేడ్ ఏరియా దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. సాధించిన రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిషలు కృషి చేస్తున్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
పథకాల అమలులో పారదర్శకత
పారదర్శకతకు ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో డబుల్ బెడ్రూం లబ్ధిదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో దళారుల జోక్యం కారణంగా నిరుపేదలకు పథకాలు అందలేదన్నారు. నారాయణఖేడ్‌లో డబుల్ బెడ్రూంల కోసం రెండు వేల దరఖాస్తులు రాగా 798 మందిని ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్, తహసీల్దార్ దశరథ్ సింగ్, మాజీ సర్పంచ్ ఎంఏ నజీబ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ పరశురామ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత
మండలానికి చెందిన 70 మంది లబ్ధిదారులకు మంగళవారం నారాయణఖేడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద ఆడపిల్లల తల్లిదండ్రులను ఆదుకునే దిశగా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆడపిల్లల పెండ్లికి రూ.1లక్ష 116 లను అందజేస్తున్నారన్నారు.
సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో ..
గిరిజనుల ఆరాధ్య గురువు సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలో సేవాలాల్ చౌక్, ఎంబీఆర్ కాలనీ, తహసీల్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా భోగ్‌భండార్ నిర్వహించడంతో పాటు సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. క్రికెట్‌పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే బహుమతులను ప్రదానం చేశారు. అలాగే, సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు. సగర సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బంజారా సేవాలాల్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్చౌహాన్, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రవీందర్‌నాయక్ ఉన్నారు.