పెద్ద హోటళ్ల నుంచి గల్లీలోని చిన్న మిర్చిబండి వరకు.. ఏ హోటల్‌కు వెళ్లినా, హాస్టల్ సందర్శించినా, పాఠశాలకు వెళ్లినా పొగ కమ్మిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మళ్లీ ఎనకటి రోజులు గుర్తుచేస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ కొరతతో వంటలు చేయడం పెద్ద టాస్క్‌గా మారింది.
సిద్దిపేటలో కమర్షియల్ గ్యాస్ లభించక సంప్రదాయ కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత హోటల్ రంగంపై తీవ్ర ప్రభావాన్నే చూపుతున్నది. పట్టణంలో హోటళ్లలో ఎకడికకడే కట్టెల పొయ్యిలు, బొగ్గు ఆధారిత పొయ్యిలు దర్శనమిస్తున్నాయి. కరెంట్ స్టౌలనూ విరివిగా వాడుతున్నారు. పొగ వస్తుండడంతో కట్టెల పొయ్యిపై వంట చేయడానికి వరర్లు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కమర్షియల్ సిలిండర్లకు కొరత లేదని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు హోటల్ యజమానులు అధిక ధరలకు సిలిండర్లు కొనుగోలు చేసి వంటలు చేస్తున్నారు. మరికొందరు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు ఆహార పదార్థాల ధరలు పెంచుతున్నారు.యుద్ధ ప్రభావంతో అన్ని ధరలు పెరుగుతుండడంతో సామాన్యుల జేబుకు చిల్లుపడుతున్నది. టీ, కాఫీలు, టిఫిన్లు, మీల్స్, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరిగినట్లు ప్రజలు చెబుతున్నారు.యుAద్ధం ఏమో కాని తమ బడ్జెట్ గుల్ల అవుతున్నదని ప్రజలు వాపోతున్నారు.
– నమస్తే తెలంగాణ, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ సిద్దిపేట, మార్చి 24