
మనోహరాబాద్, ఆగస్టు 30: మెదక్ జిల్లా శివ్వంపేటలో శ్రీబగలాముఖి అమ్మవారి శక్తిపీఠం శిలాన్యాస కార్యక్రమాన్ని సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జడ్పీటీసీ పబ్బా మహేశ్‌గుప్తా ఆధ్వర్యంలో ఉదయం నుంచి వేద బ్రాహ్మణులు మంత్రోచ్ఛరణలతో హోమం, శిలాస్యన కార్యక్రమాన్ని నిర్వహించగా, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్‌లతో సహా ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై శిలాన్యాసం కార్యక్రమాన్ని తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు చిలుముల మదన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. తమవంతు విరాళాలను అందజేశారు.
దక్షిణ భారత దేశంలో మొదటి శక్తిపీఠం..
ఉత్తర భారత దేశంలోని తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల తరువాత మూడో శక్తిపీఠాన్ని తెలంగాణ రాష్ట్రంలో శివ్వంపేటలో నిర్మిస్తున్నట్లు అర్చకులు వెంకటేశ్వరశాస్త్రి తెలిపారు. శృంగేరి పీఠం జగద్గురు భారతీతీర్థ మహాస్వామి 1985లో శివ్వంపేటలో వేదపాఠశాలను ఏర్పాటు చేయగా, 1992 వరకు కొనసాగిందన్నారు. దశమహావిద్యలో పది మంది అమ్మవార్లు ఉంటారని, అందులో బగలాముఖి అమ్మవారు గొప్ప శక్తివంతురాలన్నారు. అమ్మవారు అనుగ్రహిస్తే ప్రపంచంలో శత్రువు అనే వాడు ఉండడని, మాటకు ఎదురు ఉండదన్నారు. బహులాముఖి అనుష్టానాన్ని 30 ఏండ్లుగా చేస్తున్నారు.
అద్భుత కట్టడంగా ..
మరో అద్భుత కట్టడంగా బగలాముఖి శక్తిపీఠం నిలువనున్నదని జడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా అన్నారు. అమ్మవారి ఆలయ నిర్మాణం అష్టబుజి ఆకారంలో ఉంటుందని, ఆగమశాస్త్రం ప్రకారం ఐదు అడుగుల కృష్ణశిలతో బగలాముఖి యంత్రం చేయబడి, ఆ యంత్రంపైనే అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సాక్షాత్తు అమ్మవారే ఆలయంలో కూర్చుందా అనే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా మహామండపం 16 స్తంభాలతో నిర్మితమై అమ్మవారిని ప్రతిష్ఠించి, విగ్రహం చుట్టూ పసుపు నిరంతరం ఉండి నీటి పక్కనే అష్టబుజి ఆకారంలో ప్రదక్షిణ చేసేవిధంగా ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. 11 నెలల్లో అమ్మవారి శక్తిపీఠం పనులు పూర్తవుతాయన్నారు. కార్యక్రమంలో వేదపండితులు గంగవరం నారాయణశర్మ, పురా ణం మహేశ్వరశర్మ, రాముశర్మ, వేణుగోపాల్‌శర్మ, దత్తాత్రేయశర్మ, వెంకటేశ్వర శర్మ, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.