వడ్డేపల్లి, ఆగస్టు 28 : తాను ప్రేమించిన అమ్మాయిని దక్కనివ్వకుండా ఆమె తండ్రి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్ స్టేజీలో చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం.. జూలేకల్ స్టేజీకి చెందిన చంద్రకళ, దేవేంద్రల కుమారుడు అశోక్(22) ఓ అమ్మాయిని ఆరేండ్లుగా ఇష్టపడుతున్నాడు.
కాగా, అమ్మాయి తండ్రికి విషయం తెలిసింది. అతను పోలీసు కావడంతో కొందరు మిత్రులతో కలిసి అశోక్‌ను బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. తాను ప్రేమించిన అమ్మాయి దక్కదని కర్నూల్లోని లాడ్జిలో మంగళవారం రాత్రి అశోక్ సూసైడ్ నోట్ రాసి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కర్నూల్, శాంతినగర్ స్టేషన్లలో బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని బుధవారం స్టేషన్ సమీపంలోని రోడ్డులో మృతదేహాన్ని ఉంచి నిరసన తెలిపారు.
ఇందుకు సీఐ రవి, ఎస్సై సంతోష్ స్పందించి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పగా, ఆందోళన విరమించారు. అక్కడి నుంచి జులేకల్ స్టేజీకి వెళ్లి అక్కడ రోడ్డుపై గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యు లు, బంధువులు నిరసన తెలిపారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. గతంలో అశోక్ తండ్రి దేవేంద్ర కూడా పోలీసుల వేధింపుల వల్లే చనిపోయాడని, కొడుకును కూడా పోలీసులే పొట్టన పెట్టుకున్నారని మృతుడి తల్లి చంద్రకళ కన్నీటి పర్యంతమైంది. రోడ్డుపై నిరసన తెలుపుతున్న విషయం తెలుసుకున్న ఎస్సైలు సంతోష్, వెంకటేశ్, చంద్రకాంత్ ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబీకులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.