ఊట్కూర్ (మాగనూరు), నవంబర్ 28 : మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఫుడ్ పాయిజన్ వరుస ఘటనలపై అధికారుల తీరు హైడ్రామాను తలపిస్తోంది. ఈనెల 20వ తేదీన 100 మంది విద్యార్థు లు వాంతులు, కడుపునొప్పి అస్వస్థతకు గురి కాగా, 15 మంది విద్యార్థులు మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానలో కోలుకునేందుకు ఐదు రోజులు పట్టింది. పాఠశాలలో కు ళ్లిపోయిన కోడి గుడ్లు, పురుగులు పట్టిన బియ్యంతో భో జనం వడ్డించడంతోనే ఫుడ్ పాయిజాన్కు కారణమైనట్లు భావించి వంట ఏజెన్సీని రద్దు చేశారు.
అలాగే హెచ్ఎం, ఫుడ్ ఇన్చార్జి ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు వేశారు. సంఘటన జరిగిన మరుసటి రోజే విద్యార్థులకు పురుగు ల అన్నం వడ్డించడంతో సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ కా గా, కలెక్టర్ పర్యవేక్షణ అధికారులకు షోకాజ్ నోటీసులు అందించారు. తాజాగా పాఠశాలలో 40 మందికి ఫుడ్ పాయిజన్ అయిన ఘటనపై బుధవారం హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు ఫుడ్ పాయిజన్‌కు గురైతే అధికారులు నిద్రపోతున్నారా అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నాన్ బెయిలబుల్ కేసు జారీ చేస్తే 5 నిమిషాల్లో అధికారులు ఇక్కడకు వచ్చి రిపోర్టు చేస్తారని మండిపడింది.
హైకోర్టు ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు గురువారం పాఠశాలలోకి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు యూట్యూబ్ ఛానళ్లను పూర్తిగా నిషేధించారు. బయటి వ్యక్తులు పాఠశాలలోకి వెళ్లకుండా మెయిన్ గేట్ వద్ద పోలీసులను కాపలా ఉంచారు. విద్యార్థుల మానసిక స్థితిగతులతోపాటు మధ్యాహ్న భోజనం, వసతులను తెలుసుకునేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులను మక్తల్ సీఐ చంద్రశేఖర్, మాగనూర్ ఎస్సై అశోక్‌బాబు మధ్యాహ్నం వరకు గేటు వద్దనే అడ్డుకున్నారు. మధ్యాహ్నం 12గంటలకు జిల్లా అడిషనల్ కలెక్టర్ బెన్షాలోమ్ పాఠశాలలోకి వెళ్లారు.
మాగనూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో వారం రోజుల వ్యవధిలో విద్యార్థులు మూడు సార్లు ఫుడ్ పాయిజన్‌కు గురై అస్వస్థతకు గురికావడంతో హాజరు శాతం రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నది. మొత్తం 590 మంది విద్యార్థులు బడికి హాజరు కావాల్సి ఉండగా గురువారం కేవలం 270 మంది మాత్రమే హాజరయ్యారు. వచ్చిన వారిలో దాదాపు సగం మంది విద్యార్థులు ఇంటి నుంచి టిఫిన్ బాక్స్‌లు తెచ్చుకొని తిన్నట్లు తెలిసింది.
మాగనూరు, నవంబర్ 28 : కిరాణా దుకాణాల్లో నాణ్యతలేని వస్తువులను అమ్మితే షాపులను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఆర్డీవో రామచంద్ర హెచ్చరించారు. తాసీల్దార్ సురేశ్‌కుమార్, ఆర్ఐ శ్రీశైలంతో కలిసి ఆర్డీవో కిరాణ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు.
మాగనూర్ పాఠశాలను మధ్యాహ్నం 3 గంటల స మయంలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ శారద సందర్శించారు. ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. అధికారులు, ఉపాధ్యాయులతో సమావేశమై సంఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. పాఠశాలలో కిచెన్, స్టోర్ రూం, వాష్ రూం గదులను పర్యవేక్షించారు. తరగతు ల వారీగా తిరుగుతూ విద్యార్థులకు సమస్యలుంటే ఉ మెన్ కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్‌కు నేరుగా తెలుపాలని, విద్యార్థుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు చైర్మన్‌తో సమస్యలు చె ప్పారు. ఉడికీ ఉడకని కూరగాయలతో పురుగుల అ న్నం వడ్డిస్తున్నారని, వాష్ రూంలు శుభ్రం చేయకపోవడంతో కంపు కొడుతున్నాయని, రోజూ కలుషితమైన నీటినే తాగుతున్నామని వాపోయారు. షాపుల్లో కుర్కురేలు, బిస్కెట్లు, చాక్లెట్లు తిన్నందుకు తినగా ఫుడ్ పాయిజాన్ అయ్యిందని అధికారులు అంటున్నారని, కానీ మేం బయటకు వెళ్లిందే లేదన్నారు. ఆఫీసర్లు చెప్పేవన్నీ అబద్ధాలని స్పష్టం చేశారు.
ఇకపై ఏ పొరపాటు జరిగినా అధికారులదే పూర్తి బాధ్యతని ఆర్డీవో రాంచందర్, తాసీల్దార్ సురేశ్, ఎంఈవో అనిల్‌గౌడ్, పాఠశాల ఇన్చార్జి హెచ్ఎంను హెచ్చరించారు. పరిశీలనలో వెల్లడైన వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కాగా, ఫుడ్ పాయిజన్ ఘటనతో గురువారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటలను మీడియా కంటపడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. మహిళా సంఘాలకు చెందిన ముగ్గురు మహిళలతోపాటు పాఠశాల సిబ్బందితో భోజనం తయారు చేయించారు. విద్యార్థులకు అన్నం, క్యారెట్, ఆలుగడ్డతో తయారు చేసిన పప్పు సాంబారును వడ్డించారు.