గట్టు : తన పొలంలోకి తనను రానీయకుండా మరిది అడ్డుకుంటున్నాడని ఆరోపిస్తూ ఆలూరు గ్రామానికి చెందిన మహిళ రైతు రాణి, తన కూతురు మంజులతో కలిసి గట్టు పోలీస్ స్టేషన్ ( Gattu PS ) సమీపంలోని రోడ్డుపై సోమవారం బైఠాయించి నిరసన ( Woman farmer protests ) తెలిపారు. ఆమె మాట్లాడుతూ తన భర్త సవరన్న మృతి చెందగా, తనకు విరాసతుగా 183 / డీ1, 188/ డీ1, 184/ జీ మొదలగు సర్వే నంబర్ల లోని 1.32 ఎకరాల భూమి తనకు వచ్చిందన్నారు.
అయితే చాలాకాలంగా తన మరిది మల్లేష్ తనను పొలంలోకి రానీయకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై తాను అధికారులు, పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేకుండా పోతుందని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
అనంతరం పోలీసుల హామీ మేరకు ఆమె నిరసనను విరమించారు. తనకు వాటాగా రావాల్సిన 7.18 ఎకరాల భూమిని తన మరిది అక్రమంగా గిఫ్ట్ డీడ్ చేయించుకున్నాడని తల్లి, కూతురు ఆరోపించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరారు.