గద్వాల, డిసెంబర్ 12 : ప్రజలకు మెరుగైన పాలన అందించడంతోపాటు, అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో అధికారులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి మంత్రి హాజరు కాగా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జెడ్పీచైర్‌పర్సన్ సరిత, ఎమ్మెల్సీ చల్లావెంకట్రామిరెడ్డి, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, అదనపు కలెక్టర్లు శ్రీనివాసులు,అపూర్వచౌహాన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మంత్రి సివిల్‌సప్లయ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు రైస్ మిల్లుల యజమానులు ప్రభుత్వం నుంచి వడ్లు తీసుకొని బియ్యం ఇవ్వకుండా రూ.100కోట్లకు అవినీతికి పాల్పడ్డారని ప్రచారం జరుగుతుందని, అవినీతికి పాల్పడ్డ మిల్లుల యజమానులపై ఎందుకు పీడీ యాక్ట్ నమోదు చేయలేదని ప్రశ్నించారు. మంత్రి అడిగిన ప్రశ్నకు ఆశాఖ అధికారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో రైస్ మిల్లర్లకు ఎన్ని క్వింటాళ్ల వరి ధాన్యం ఇచ్చారు, వారు ఎంత బియ్యం ప్రభుత్వానికి తిరి గి ఇచ్చారో చెప్పాలన్నారు. దీంతో అధికారి నుంచి సమాధానం రాలేదు. ఒక వేళ బియ్యం ఇవ్వని రైస్ మిల్లులపై కేసులు నమోదు చేశారా, చేయకపోతే ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పనితీరు ఇలా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఇరిగేషన్ శాఖపై మాట్లాడుతూ జిల్లాలో ఏవైనా ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు ఉన్నాయా.. ఉంటే ఎందుకు ఉన్నా యి వాటి పురోగతి ఏంటి మిగిలిన పనులు పూర్తి చేయాలంటే ఎన్ని నిధులు కావాలని ఆ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జూరాల, నెట్టెంపాడ్, ర్యాలంపాడు, ఆర్డీఎస్, తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎంతవరకు ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయో నివేదిక అందజేయాలని ఆశాఖ అధికారులకు ఆదేశించారు.అబ్కారీశాఖపై మాట్లాడుతూ ఆబ్కారీశాఖలో ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలన్నారు. జిల్లాలో ఎన్ని సొసైటీలు ఉన్నాయి, కల్లు రసాయనాలతో త యారు చేస్తున్నారా లేక ఈత చెట్లకు గీసిన కల్లు ప్రజలకు విక్రయిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అక్రమ మద్యం, గుడుంబా విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.అనంతరం వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్అండ్బీ తదితర శాఖలపై సమీక్ష నిర్వహించి అందులోని పురోగతిని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. అధికారులు ప్రజలకు పారదర్శకంగా అవినీతి లేని పాలన అందించాలని ఆదేశించారు. ధరణిలో సమస్యలు పెండింగ్‌లో ఉన్న వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ధా న్యం సేకరణపై ఆరాతీశారు. జూరాల దగ్గర నిర్మిస్తున్న టూరిజం ప్రాజెక్టు పనులు, అలంపూర్‌లో జోగుళాంబ ఆలయంలో ప్రసాద్‌స్కీం పనులు 70శాతం పూర్తి కావచ్చాయని టూరిజం అధికారులు మంత్రికి తెలిపారు. ఆరోగ్యశాఖ గురించి మంత్రి ఆరా తీయగా జిల్లాలో గద్వాల 300పడకల దవాఖాన, అలంపూర్‌లో 100 పడకల దవాఖాన నిర్మాణ పనులు 90శాతం పూర్తయ్యాయని అధికారులు మంత్రికి తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు చివరి దశకు వచ్చాయని వాటికి నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయడానికి సహకరించాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, జెడ్పీవైస్ చైర్మన్ సరోజమ్మ, వైద్యాధికారులు శశికళ, కిశోర్‌కుమార్ పాల్గొన్నారు.
గద్వాల అర్బన్,డిసెంబర్ 12 : కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్వహించిన సమీక్షా సమావేశానికి పర్యాటక శాఖ అధికారులు హాజరుకాకపోవడం విస్మయా నికి గురిచేసింది. మంత్రి అడిగిన ప్రశ్నలకు సమీక్షకు పర్యాటక శాఖకు తరఫున హాజరైన వ్యక్తి సరైన సమాధానం చెప్పకపోవడంతో మంత్రి మీరు ఎవరు అం టూ అడగడంతో విషయం పొక్కింది. పర్యాటక శాఖ అధికారులు హాజరుకాకపోగా హరిత హోటల్ మేనేజర్‌కు వివరాలు పేపర్లో రాసి పంపించినట్లు విష యం బయటపడింది.