గద్వాల, మార్చి 20 : పాలకుల నిర్లక్ష్యంతో కృష్ణమ్మ కన్నీటి ధారలు కా ర్చుతుంది. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా.. ప్రాజెక్టు సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతూనే ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పిల్‌వే గేట్ల మరమ్మతులు, లీకేజీ సమస్యలు పరిష్కరిస్తామని ప్రాజెక్టును సందర్శించిన పాలకులు చెబుతున్న మాటలు ఒట్టి కోతలుగానే మారుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలోనే బహుళార్థ సాధక ప్రాజెక్టుగా.. వరప్రదాయినిగా గుర్తింపు పొందిన పీజేపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం ఉనికిని కోల్పోయే ప్రమాదం నెలకొన్నది. వరదలు వచ్చినా పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేదు. వచ్చిన నీటినంతా దిగువకు వదిలే పరిస్థితి. దీంతో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందక రైతులు సతమతమవుతున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి వద్ద కృష్ణానదిపై నిర్మించిన మొదటి ఏకైక బహుళార్థసాధక ప్రాజెక్టు జూరాల. 1995లో ప్రారంభమైనా.. మొదట నీటి కేటాయింపులు 17.94 టీఎంసీలు. అయితే కర్ణాటకలోని కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయనే నెపంతో 11.94 టీఎంసీలకు కుదించారు. తాగు, సాగునీటితోపాటు 240 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ప్రాజెక్టు ప్రధాన ఆధారంగా మారింది. డ్యాం కుడి, ఎడమ కాల్వల ద్వారా గద్వాల జిల్లాలో 1.04 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. నెట్టెంపాడ్, గట్టు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు జూరాల నీళ్లే అందుతుంది.
అంతటి ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు నేడు నిర్లక్ష్యానికి గురవుతోంది. సిల్ట్‌తో తగ్గిన నిల్వలు జూరాల ప్రాజెక్టులో సిల్ట్ పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. డ్యాం పూర్తయిన తర్వాత సీడబ్ల్యూసీ 17.81 టీఎంసీలు కేటాయించింది. అయితే ఆ నీటిని వాడుకునేలా ప్రాజెక్టును రూపకల్పన చేయకపోవడంతో ప్రస్తుతం 11.94 టీఎంసీలు వినియోగించే అవకాశం ఏర్పడింది.
గత కాంగ్రెస్, టీడీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా 6 టీఎంసీల నీటి వాటాను కోల్పోయాం. 2013 నాటికి ప్రాజెక్టులో సిల్ట్ పేరుకపోవడంతో నిల్వను 9.74 టీఎంసీలకు తగ్గించారు. 2025-26 నాటికి ప్రాజెక్టులో కేవలం 7.74 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసుకునే పరిస్థితి నెలకొన్నది. దీంతో ఇక్కడ 5 టీఎంసీలు తెలంగాణ రైతులు కోల్పోవాల్సిన పరిస్థితి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి 31 ఏళ్లు కావడంతో ప్రాజెక్టులో భారీగా పూడిక పేరుకుపోయింది. జూరాల ప్రాజెక్టులో ఉన్న పూడిక తీయ డం సాధ్యం కాదని పాలకులకు తెలిసినా.. ఎన్నికల సమయంలో పూడిక తీస్తామని చెప్పడం పరిపాటిగా మారింది. దీంతో కృష్ణాబేసిన్‌లో మనకు రావాల్సిన నీటి వాటాను వాడుకో లేని పరిస్థితి నెలకొన్నది.
జూరాల ప్రాజెక్టు గేట్లు చాలా కాలంగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో గేట్లకు అమర్చిన వైర్లు తెగిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వానకాలంలో గేట్లకు ఉన్న రోప్స్ తెగడంతో ప్రాజెక్టు భద్రత విషయంలో ఆందోళన నెలకొన్నది. రోప్స్ (ఇనుప తాళ్లు) తెగిపోవడం వల్ల గేట్ల మరమ్మతులకు ఇబ్బందులు కలగడంతోపాటు, ప్రాజెక్టుకు వరద వచ్చిన సమయంలో గేట్లు ఎత్తడానికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొన్నది. 2021లో గేట్ల మరమ్మతులకు రూ.11.50 కోట్లతో టెండర్లు పిలిచారు. కానీ పనులు మాత్రం నేటికీ నత్తనడకన సాగుతున్నాయి. 42 గేట్లకు సంబంధించి రోప్స్ మార్చడానికి రూ.4.60 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటికీ ఆమోదం లభించలేదు. మరమ్మతుల్లో పురోగతి లేకపోవ
డంతో భారీ వరదొస్తే ప్రాజెక్టుకు ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు ప్రాజెక్టు లీకేజీ సమస్యలతో సతమతమవుతోంది. డ్యాం సేఫ్టీ నివేదికను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రమాదంలో పడింది. ప్రాజెక్టు కింద బ్రిడ్జి నిర్మించకపోడంతో 30 ఏండ్లుగా భారీ వాహనాలు ప్రా జెక్టుపై నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో కుదుపునకు గురై బ్రిడ్జి జీవితకాలం తగ్గిపోతుందని సేఫ్టీ కమిటీ సూచిస్తున్నది. గేట్ల మరమ్మతులతోపాటు సిల్ట్ తీస్తే తప్పా జూరాలకు పునర్జీవం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రాజెక్టుకు ఇన్ని కష్టాలు ఉండగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా విమర్శలు మానుకొని ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.