సకల కళా‘ప్రవీణుడు’.. ఓ వైపు తబలా వాయిద్య కారుడిగా గుర్తింపు.. మరో వైపు కీర్తనలు రాయగలడు.. గానకోకిలలా పాటలూ పాడగలడు.. అందుకే బహుముఖ ప్రజ్ఞాశాలిగా చిన్నంబావి మండలం వెలగొండ గ్రామానికి చెందిన యువ కళాకారుడు గుర్తింపు పొందాడు. ఓ వైపు విద్యుత్ శాఖలో ఔట్సోర్సింగ్ విభాగంలో ఉద్యోగం చేస్తూనే తన ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తూ ప్రశంసలు, అవార్డులు సొంతం చేసుకున్నాడు. ప్రొఫెసర్ జయశంకర్ అవార్డును సొంతం చేసుకొని శభాష్ అనిపించుకుంటున్నాడు.
వనపర్తి, ఫిబ్రవరి 11 : వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెల్లగొండ గ్రామానికి చెందిన శ్రీనివాసులు, వెంకటమ్మ కుమారుడు ప్రవీణ్‌కుమార్ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ప్రవీణ్‌కు పదేండ్ల వయస్సు ఉన్న సమయంలో తండ్రి మరణించాడు. అప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉంటూ చదువుకున్నాడు. ఐటీఐ పూర్తి చేసి ప్రస్తుతం విద్యుత్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. చిన్నతనం నుంచే తాత వెంట భజనలు, కీర్తనలు, నాటక ప్రదర్శనలకు వెళ్లేవాడు. అలా భజనలు, కీర్తనలు, నాటకాలపై ఆసక్తి పెరిగింది. గ్రామీణ స్థాయిలోని నాటక ప్రదర్శనల్లో తబలా వాయించడంతోపాటు సింగర్‌గా కూడా రాణించాడు. 2008 సంవత్సరంలో ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన తబలా శిక్షణలో ప్రతిభ చాటాడు. హైదరాబాద్‌లోని త్యాగరాయ సంగీత, నృత్య కళాశాలలో శాస్త్రీయ సంగీత వాయిద్యమైన తబలాపై ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు ప్రవేశం పొందాడు.
నాకు మూడేండ్లు ఉన్నప్పటి నుంచే తాత వెంట భజనలు, కీర్తనల ప్రదర్శనలకు వెళ్లేవాడిని. అలా ఆసక్తి పెరిగింది. పదేండ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. ఆ తరువాత తాత, అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటూనే తబలా, సింగర్‌గా ప్రయాణం మొదలుపెట్టా. తబలాపై ప్రత్యేక శిక్షణ తీసుకోవడంతోపాటు పలు ప్రదర్శనలు ఇచ్చాను. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రామాల్లోని కళాకారులను ప్రోత్సహించడంతో ఎంతోమంది కళలు బయటకొస్తున్నాయి.
– ప్రవీణ్‌కుమార్, కళాకారుడు