మాగనూరు/కృష్ణ, మార్చి 15: ముడుమాల్ నిలువు రాళ్లు (మెన్జిర్స్)ను యునెస్కో ప్రాథమిక ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చడంలో జై మక్తల్ ట్రస్ట్ కీలక పాత్ర పోషించిందని జై మక్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ కుమార్ తెలిపారు. 3500 ఏండ్ల క్రితం నాటి మెగాలిథిక్ స్మారక చిహ్నాలను ముడుమాల్ నిలువురాళ్లు అంటారు. ఈ విజయం తెలంగాణకు మాత్రమే కాక, భారత సాంస్కృతిక వారసత్వానికి గర్వ కారణంగా నిలిచిందని సందీప్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పురాతన స్మారక చిహ్నాల పరిరక్షణ, ప్రచారంలో ట్రస్ట్ అవిరామ కృషి అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పొందటానికి కారణమైందన్నారు.
ఈ సందర్భంగా మక్తల సందీప్ కుమార్ మాట్లాడుతూ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల గుర్తింపు పొందాలంటే కఠిన పరిస్థితులు ఉంటాయన్నారు. ఇది మరింత నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపును జై మక్తల్ ట్రస్ట్ ప్రేరణగా నిలిచిందన్నారు. అందులో భాగంగా ముడుమల్ నిలువు రాళ్లు (మెన్జిర్స్) పరిరక్షణకు వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టిందని చెప్పారు. నాటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ మద్దతుతోనే ఈ కీలక విజయం సాధించామన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిలకు కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారం వల్లే మెన్జిర్స్కు యునెస్కో ప్రాథమిక ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించిందన్నారు.
పలుమార్లు ముడుమల్ నిలువు రాళ్లు (మెన్హిర్స్) వద్ద పరిశుభ్రత కోసం కార్యక్రమాలు నిర్వహించినట్లు సందీప్‌కుమార్ తెలిపారు. మెన్జిర్స్ పట్ల స్థానికుల్లో అవగాహనకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ సంయుక్తంగా ‘ఆర్బిట్ 2022’ అనే పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా మెన్హిర్స్ ఖగోళ శాస్త్ర సంబంధ ప్రాముఖ్యాన్ని గుర్తించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత పొందిన ఈ ప్రాజెక్టులో దక్షిణ కొరియాలోని సెజాంగ్ విశ్వవిద్యాలయం ముడుమల్ నిలువు రాళ్లు (మెన్హిర్స్) ఖగోళ ప్రాముఖ్యతపై ప్రత్యేక పరిశోధనలు నిర్వహించింది. మెన్జిర్స్కు యునెస్కో గుర్తింపు వల్ల అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంతోపాటు ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక వృద్ధిరేటు, మౌలిక వసతులు మెరుగవుతాయన్నారు సందీప్ కుమార్.