తిమ్మాజిపేట : ఫైనాన్స్ సిబ్బంది వేధింపులను ( Harassment ) భరించలేక ఒక యువకుడు ట్రాక్టర్‌కు ( Tractor ) నిప్పంటించాడు. స్థానికులు, బాధితుని వివరాల మేరకు.. తిమ్మాజీపేట మండలం ( Timmajipet ) చేగుంట గ్రామానికి చెందిన గడ్డం రవి గ్రామంలో తనకున్న వ్యవసాయ పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
వ్యవసాయ అవసరాల కోసం, అద్దెకు తిప్పడానికి రెండు సంవత్సరాల క్రితం తన బంధువు పేరుపై ట్రాక్టర్‌ను కొనుగోలు చేశాడు. కొంత డౌన్ పేమెంట్ చెల్లించి మిగతాది ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా లోన్ తీసుకున్నాడు. ఆరు నెలలకు ఒకసారి రూ. 98,000 ఈఎంఐ కట్టేలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో రెండు ఈఎంఐలు ( EMI ) చెల్లించాడు. మూడో ఈఎంఐ చెల్లింపులో భాగంగా రూ. 80వేలు చెల్లించి, మిగిలిన రూ. 18 వేలు ఒకటి రెండు రోజుల్లో చెల్లిస్తానని ఫైనాన్స్ ప్రతినిధులకు ( Finance Representation ) నచ్చజెప్పాడు.
అయితే ఫైనాన్స్ ప్రతినిధి ఒకరు శనివారం గ్రామానికి వచ్చి మిగతా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయగా రెండు రోజుల్లో చెల్లిస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అతను ససేమిరా వినకపోవడంతో, మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడి నచ్చ చెప్పాడు. అయితే వచ్చిన ప్రతినిధి వినకుండా దుర్భశలాడాడని, కట్టిన రూ. 80 వేలు కూడా రసీదు లేదని, సీజ్ చేస్తానంటూ భయపెట్టడంతో బాధితుడు రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి ట్రాక్టర్‌పై చల్లి నిప్పంటించాడు. ఫైనాన్స్ ప్రతినిధి ఒత్తిడి భరించలేక ట్రాక్టర్‌ను దహనం చేశానని, ఫైనాన్స్ వారి ఒత్తిళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు రవి వెల్లడించారు.