మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 27 : ప్రైవేట్ సర్వీస్‌లకు దీటుగా సేవలందించడంపై టీఎస్ ఆర్టీసీ దృష్టి సారించింది. నూతన బస్సుల కొనుగోలు, ఆన్లైన్ సేవలు, టికెట్‌పై డిస్కౌంట్ అందిస్తున్నది. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించడంతోపాటు సంఖ్యను పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నది. క్షేత్రస్థాయిలో నిత్యం ప్రయాణికులతో మెలిగే కండక్టర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. టీఎస్ఆర్టీసీ ఏప్రిల్ ఛాలెంజ్ ఫర్ ట్రైనింగ్ (టీఏసీటీ) ద్వారా ఈ నెల 21వ తేదీ నుంచి శిక్షణ ఇస్తున్నారు.
‘నేను.. నా ఉద్యోగంలో రాణిస్తా’ అనే నినాదంతో దశలవారీగా అన్ని విభాగాల సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వనున్నది. మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, షాద్‌నగర్, గద్వాల, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, కోస్గి డిపోల్లో శిక్షణ ఇస్తున్నారు. రీజియన్‌లో ఉన్న 1,705 మందికి.. రోజుకు 30 నుంచి 40 మంది చొప్పున కండక్టర్లను బ్యాచ్‌గా ఏర్పాటు చేశారు. సెలవులు పెట్టినవారు, సీఎల్, వీక్లీ ఆఫ్ ఉన్న వారిని ట్రైనింగ్‌కు ఎంపిక చేశారు. సిబ్బందికి రూ.200 చెల్లించి.. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు శిక్షణ ఇస్తున్నారు. డిప్యూటీ ఆర్ఎంలు సంస్థల పని విధానాలు, నిబంధనలు, సంస్థాగత విషయాలపై వివరిస్తున్నారు.
మొదటి దశలో కండక్టర్లకు..
ప్రయాణికులతో వ్యవహరించే తీరు, మాట్లాడే విధానం వంటి అంశాలపై ఆర్టీసీ ఎంపిక చేసిన సీనియర్ కామర్స్ ప్రొఫెసర్స్, బ్యాంక్, ఎల్ఐసీ మార్కెటింగ్ అధికారులతో తరగతులు ఇప్పిస్తున్నాం. శిక్షణకు హాజరయ్యేవారికి టీ, మధ్యాహ్న భోజనం సమకూరుస్తున్నాం. మొదటి దశలో కండక్టర్లకు శిక్షణ ఇస్తున్నాం. అందుకుగానూ డిపోల వారీగా ఏర్పాట్లు చేశాం. సంస్థ ఆదాయం పెంచేందుకు అన్ని విధాలా కృషి చేస్తాం.
– వి.శ్రీదేవి, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, మహబూబ్‌నగర్