పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మహా అద్భుతం.. సీఎం కేసీఆర్ ఈ ఎత్తిపోతలకు రూపకల్పన చేయడంతో దేశంలోనే అతిపెద్దదిగా ఖ్యాతి దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నది. అంజనగిరి, ఏదుల లిఫ్ట్‌ల వద్ద ఉన్న సర్జ్‌పూల్స్ ఆసియాలోనే బిగ్గెస్ట్‌గా రికార్డు నమోదు చేయనున్నాయి. ఒక్కోటి 255 మీటర్ల పొడవు.. 20 మీటర్ల వెడల్పు.. 74 మీటర్ల ఎత్తు ఉన్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని బాహుబలి మోటర్లు 139 మెగావాట్లు ఉంటే.. వాటికి మించిన సామర్థ్యం 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లు ఇక్కడ బిగించారు. ఇలా పనులన్నీ శరవేగంగా పూర్తి కాగా.. త్వరలో కొండలను తొలుచుకొని.. సొరంగాలను దాటుకుంటూ.. పంపుల్లో పరవళ్లు తొక్కుతూ.. కాల్వల్లో పారుతూ.. రిజర్వాయర్లను కృష్ణమ్మ ముంచెత్తనున్నది. ఎప్పుడెప్పుడు బీడు భూముల్లో జలసవ్వడి చేయాలన్న తలంపుతో కృష్ణమ్మ ఎదురుచూస్తున్నది. దశాబ్దాల కల సాకారం కావడానికి మరో అడుగు దూరం మాత్రమే మిగిలి ఉన్నది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం డ్రైరన్‌కు అధికారులు సన్నాహాలు చేశారు. ఇరిగేషన్ సీఎస్ రజత్‌కుమార్, సీఈ మురళీధర్‌రావు, ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం 18 ప్యాకేజీల్లో ఐదు రిజర్వాయర్లు, నాలుగు పంపింగ్ కేంద్రాలు, సొరంగాలు, కాల్వల పనులు చివరి దశకు చేరాయి. దీంతో డ్రైరన్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో బిగించిన మోటార్లు కాళేశ్వరం ప్రాజెక్టు బాహుబలి మోటర్లకంటే ఎంతో శక్తి కలిగినవి. అక్కడ 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లను వినియోగించడంతో బాహుబలి మోటర్లుగా పిలిచారు. కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువ 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్లను ఏర్పాటు చేయడంతో వాటికి మించినవిగా పేరొందాయి. ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ పంపులను ప్రత్యేకంగా తయారు చేసింది. ఈభారీ పంపులను భూగర్భంలోని పంపుహౌస్ వద్ద బిగించే పనులను ఇంజినీర్లు, సిబ్బంది రేయింబవళ్లు టన్నెల్‌లోనే ఉంటూ చేపడుతున్నారు.
– మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఆసియాలోనే అతిపెద్ద సర్జ్‌పూల్స్
పాలమూరు ఎత్తిపోతల పథకం దశబ్దాల కల నెరవేరడానికి అడుగు దూరం మాత్రమే మిగిలి ఉన్నది. దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా ఖ్యాతి దక్కించుకోనున్న ఈ పథకం రూపశిల్పి సీఎం కేసీఆర్.. అంతటి లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇలా ప్రాజెక్టు ప్రారంభానికి ముందే అరుదైన రికార్డులను సాధించింది. లిఫ్ట్ పరిధిలో నిర్మించిన అండర్‌గ్రౌండ్ సర్జ్‌పూల్స్ ఆసియాలోనే అతిపెద్దవి. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంజనగిరి, వనపర్తి జిల్లా ఏదుల వద్ద నిర్మించిన సర్జ్‌పూల్స్ ఆసియాలోనే బిగ్గెస్ట్‌గా రికార్డు నమోదు చేయనున్నాయి. ఒక్కోటి 255 మీటర్ల పొడవు.. 20 మీటర్ల వెడల్పు.. 74 మీటర్ల ఎత్తు ఉన్నాయి. ఇంత భారీగా ఆసియాలోనే మరెక్కడా లేవని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. ఇక బాహుబలిని మించిన పంపులు ఇక్కడ బిగించారు. జీరో పాయింట్ నుంచి 24,000 క్యూసెక్కుల నీరు గ్రావిటీ కాల్వలోకి వస్తుంది. అక్కడి నుంచి హెడ్‌రెగ్యులేటరీ మీదుగా ఒక్కోటి వెడల్పు 11 మీటర్లు, ఎత్తు 11 మీటర్లు ఉండే టన్నెల్లో మీదుగా సర్జ్‌పూల్‌లోకి వెళ్తాయి. నిత్యం ఒక్కో పంపు 0.25 టీఎంసీలను ఎత్తిపోసే సామర్థ్యం ఉన్నాయి. ఇలా ఎనిమిది పంపులు ఒక్కో రోజులో రెండు టీఎంసీలు ఎత్తిపోసేలా వీటిని డిజైన్ చేశారు. సర్జ్‌పూల్‌లోకి వచ్చే చెత్తాచెదారాన్ని అడ్డుకునేందుకు టన్నెల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందుకే ఈ ఎత్తిపోతల పథకం ఓ ఇంజినీరింగ్ అద్భుతమన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి.
బీడు భూముల్లోకి తరలివస్తున్న కృష్ణమ్మ
ఏనాడు కలగనలేదు రైతాంగం.. కనీసం ఊహించలేదు ఇక్కడి జనం.. భూగర్భాన్ని చీల్చుకుంటూ కృష్ణమ్మ తరలిరానున్న అద్భుత ఘట్టం త్వరలో ఆవిష్కృతం కానున్నది. త్వరలోనే కల నెరవేరే రోజు రానుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం డ్రైరన్ విజయవంతం కావాలని ఎదురు చూస్తున్నారు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ సమీపంలో పంప్‌హౌస్‌ను మొత్తం భూగర్భంలో నిర్మించారు. టన్నెల్, సర్జ్‌పూల్, పంప్‌హౌస్‌ను 22 మీటర్ల లోతున ఉన్నది. ఇక్కడి నుంచి 104 మీటర్ల ఎత్తులో ఉండే అంజనగిరి రిజర్వాయర్‌లోకి నీని పంపింగ్ చేయనున్నారు. రిజర్వాయర్ సామర్థ్యం 6.400 టీఎంసీలు. నీటినిల్వ కోసం 10.810 కిలోమీటర్ల బండ్ నిర్మించారు. సామర్థ్యం 338.500 మీటర్లు కాగా, 325.250 మీటర్ల స్థాయిలో నీటిమట్టం ఉంచుతారు. రిజర్వాయర్ నిర్మాణంతో 2,465 ఎకరాల భూమి సబ్మార్జిన్లో పోగా బాధిత రైతులకు అప్పట్లోనే పరిహారం ఇచ్చారు. అంజగిరి గ్రామం ముంపునకు గురైంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి చొరవతో ప్రభుత్వం వీరికి బండ్ సమీంలోనే పునరావాసం కల్పించింది. దీంతో గేటెట్ కమ్యూనిటీ తరహాలో ఇండ్ల నిర్మాణం జరిగింది. త్వరలో నీటి రాకతో పాలమూరు రైతన్నల ఎదురుచూపు ఫలించనున్నది.
నాడు రూ.లక్ష ఎకరం.. నేడు రూ.40 లక్షలు
పాలమూరు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు ఎల్లూరు-నార్లాపూర్, అంజనగిరి శివారులో నిర్మించడంతో ఇక్కడి భూములకు ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో కృష్ణానది సమీపంలోనే పారుతున్నా.. వర్షాధారంపైనే పంటలు సాగు చేసేటోళ్లు.. బోర్ల కింద వరి, కొన్ని చోట్ల వివిధ తోటలు కనిపించేవి. రెండు ప్రాజెక్టులు రావడం.. సాగునీరు పుష్కలం కావడంతో 2016లో ఎకరం భూమి రూ.లక్ష ఉంటే.. నేడు రూ.40 లక్షలు పలుకుతున్నది. అయితే రిజర్వాయర్ల పరిధిలో భూములు కోల్పోతే 2013 జీవో అమలు చేసి ప్రభుత్వం పరిహారం అందించింది దీంతో అప్పట్లోనే ఎకరాకు రూ.5.50 లక్షలు చెల్లించింది.
అడుగు దూరంలో..
శ్రీశైలం జలాశయం 269.750 మీటర్ల స్టోరేజీ ఉండి నీటి లభ్యత ఉండే కొల్లాపూర్ సమీపంలోని అంజనగిరికి సమీపంలో ఉన్న కోతిగుండును జీరో పాయింట్‌గా గుర్తించారు. ఇక్కడి నుంచి 1.225 కిలోమీటర్ల మేర అప్రోచ్ కాల్వను 30 మీటర్ల లోతు ఉండేలా సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి హెడ్ రెగ్యులేటరీకి కృష్ణా జలాలు చేరనున్నాయి. రెగ్యులేటరీ నుంచి నీరు నేరుగా పంప్‌హౌస్ వద్దకు తరలించేలా ఇక్కడ ఎనిమిది గేట్లను బిగించారు. అవసరమైన సమయంలో వీటిని నాలుగు మీటర్లు ఎత్తి టన్నెల్లోకి నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి ఈ నీరంతా సర్జ్‌పూల్‌లోకి వెళ్తుంది. వ్యాసార్థం ఎక్కువ ఉండేలా డిజైన్ చేసి రోజుకూ 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా డిజైన్ చేశారు. సర్జ్‌పూల్ నుంచి డ్రాఫ్ట్ ట్యూబ్‌తో పక్కనే ఉన్న పంప్‌హౌస్‌లోకి నీటిని తరలిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంపులతో 104 మీటర్ల ఎత్తుకి నీటిని పంపింగ్ చేశారు. సుమారు 15 మీటర్ల వ్యాసార్థ్యం ఉన్న భారీ పైపులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పంపింగ్ అయిన నీరంతా అంజనగిరి (నార్లాపూర్) రిజర్వాయర్‌లోకి చేరుతుంది. ఈ జలాశయం కెపాసిటీ 6.400 టీఎంసీలు. కాగా మొదటి పంప్ డ్రైరన్ సక్సెస్ అయ్యాక.. రెండో పంపును టెస్టింగ్ నిర్వహించి.. మరో 15 రోజుల్లో వెట్న్ పూర్తి చేయడానికి ఇంజినీర్లు సన్నాహాలు చేస్తున్నారు. వెట్న్ విజయవంతమయ్యాక సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు ఎత్తిపోతల పథకం జలాలను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మొదటి పంపు సిద్ధం కాగా.. రేయింబవళ్లు టెక్నికల్ సిబ్బంది, అటు ట్రాన్స్‌కో, ఇటు ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు మినట్ టు మినట్ ప్రోగ్రాంను సెట్ చేసుకుని విజయవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రాజెక్టు సీఈ హమీద్‌ఖాన్ నేతృత్వంలోని ఇరిగేషన్ శాఖాధికారురూ నిద్రాహారాలు మాని ఇక్కడే తిష్టవేశారు. మెఘా ఇంజినీరింగ్ సిబ్బంది పనుల్లో పాలు పంచుకుంటున్నారు. సివిల్ వర్క్స్, ఇతరాత్ర పనులను పూర్తి చేశారు. పంపుల బిగింపు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేసి వెట్న్‌క్రు సిద్ధమవుతున్నారు. సిబ్బంది హడావుడితో అంజనగిరి పంప్‌హౌస్ వద్ద సందడి నెలకొన్నది.
నేడు డ్రైరన్‌కు సన్నాహాలు
ఎట్టకేలకు పీఆర్ఎల్ డ్రైరన్‌కు ఇంజినీరింగ్ అధికారులు సన్నాహాలు చేశారు. ఇదో చారిత్రాత్మక ఘట్టంగా వారు అభివర్ణిస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టు లిఫ్ట్-1లో భాగంగా అంజనగిరి వద్ద మొత్తం 9 పంపులను బిగించారు. వీటిలో మొదటి పంపు డ్రైరన్‌కు సిద్ధమైంది. సక్సెస్ అయితే మరో పంపును రెండ్రోజుల్లో డ్రైరన్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు పంపులు సిద్ధమయ్యాక 15 రోజుల్లోగా వెట్న్ నిర్వహిస్తామని ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వెల్లడించారు. ఇప్పటికే అంజనగిరి వద్ద నిర్మించిన 400/11 కేవీ సబ్‌స్టేషన్ విద్యుత్ చార్జ్ ప్రక్రియను ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు దగ్గరుండి పూర్తి చేసి సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఇక్కడి నుంచి అండర్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పంపులకు ప్యానళ్లతో విద్యుత్ సరఫరా అందించే ప్రక్రియ తుది దశకు చేరింది. ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు డ్రైరన్ చేపడుతున్నారు. ఈ ప్రక్రియను ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, సీఈ మురళీధర్‌రావు, ప్రాజెక్టుల ముఖ్య సలహాదారు పెంటారెడ్డి, పీఆర్ఎల్ సీఈ హమీద్ఖాన్తోపాటు ఎస్ఈలు, ఈఈలు, డీఈలు, ట్రన్స్కో అధికారులు పర్యవేక్షించనున్నారు. విజయవంతంగా పూర్తి చేసి వెట్న్‌క్రు సిద్ధమవు తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే బీడు భూముల్లో కృష్ణమ్మ పరుగులు తీయనున్నది. బీడు భూములు సస్యశ్యామలం కానుండడంతో రైతులు సంతోషం వ్యక్తం
చేస్తున్నారు.