కొల్లాపూర్, ఏప్రిల్ 17: స్వరాష్ట్రం ఏర్పాటుతోనే కొల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. ఎనిమిదేండ్ల కాలంలో బీడు భూములకు ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుతో సాగునీరు అందిస్తుండగా.. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరాతోపాటు మండలంలోని ఎల్లూరు వద్ద రూ.980కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ఏడు మండలాల్లోని 132 గ్రామపంచాయతీల్లో ఇంటింటికీ నల్లా ద్వారా శుద్ధజలాన్ని అందిస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి రూ.వందల కోట్లను మంజూరు చేయించి పనులను పర్యవేక్షిస్తున్నారు. గతంలో సాగునీరు లేక సాగు చేయలేక పక్క రాష్ర్టాలకు వలసలు వెళ్లారు. కాగా పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో అన్ని రంగాల్లో కొల్లాపూర్ దూసుకెళ్తున్నది. విద్య, వైద్యం, సాగు, తాగునీటి రంగాల్లో పరుగులు పెడుతున్నది. నాడు ఇంటర్ చదువు ముగిశాక, డిగ్రీ చదవాలంటే సుదూర ప్రాంతాలకు విద్యార్థులు వెళ్లాల్సి ఉండగా ఇప్పుడు ఇబ్బందులు తప్పాయి. పల్లెలకు బీటీరోడ్లు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, హరిత నర్సరీలు, జీపీలకు పక్కా భవనాలు ఏర్పాటయ్యాయి.