మహబూబ్నగర్ కలెక్టరేట్, జనవరి 4 : పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో గుండుమాల్లో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో జరిగిన అవకతవకలపై ‘పైరవీలకు పెద్దపీట’ అనే శీర్షికన ఈ నెల 4న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురించిన కథనానికి కలెక్టర్ విజయేందిరబోయి స్పందించారు. జిల్లా క్రీడల నిర్వహణ అధికారి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి, ఉమ్మడి జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శికి ప్రతిభ ఉన్న క్రీడాకారులకు నష్టం జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డీవైఎస్వో, డీఐఈవో కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాలీబాల్ జాతీయస్థాయి ఎంపికల్లో ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయాలపై ఆరా తీశారు.
ఎస్జీఎఫ్ క్రీడాపోటీల్లో ప్రతిభావంతులను కాదని పైరవీలకు పెద్దపీట వేసిన ఘటనలో క్రీడల నిర్వహణలో పాలుపంచుకున్న ఇద్దరు ఫిజికల్ డైరెక్టర్ల పాత్రపై అనుమానాలు వెల్లు వెత్తుతున్నాయి. క్రీడా మైదానంలోకి కోర్టులో ఎలా నిలబడాలి, వ్యూహరచన, వేగవంతమైన కదలిక, తదితర అంశాలపై సమగ్ర అవగాహన సైతం లేని ఓ క్రీడాకారిణి, మైదానంలోకి వచ్చి క్రీడాకోర్టులోకి దిగని మరో క్రీడాకారిణికి పేర్లు జాతీయస్థాయి తుదిజాబితాల్లో పొందుపర్చినట్లు తెలుస్తోంది. ఒకరు తన కుమార్తెను కారులో తీసుకొచ్చి ఎలాంటి గేమ్ ఆడించకుండానే ఫైనల్ జాబితాలో పేరు రాయించినట్లు.. మరొకరు తన శిష్యురాలు అంటూ ఖచ్చితంగా ఎంపిక చేయాలని పట్టుపడటంతో ఇలా అవకతవకలు చోటు చేసుకున్నట్లు క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలపై సమగ్ర విచారణ చేపట్టి కలెక్టర్కు నివేదించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారిణి కౌసర్జహాన్ తెలిపారు.
ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి పాపిరెడ్డి ఏమన్నారంటే.. కీర్తి అనే అమ్మాయి చాలా మంచి ప్లేయర్. ఆమె పేరు నాకు తెలియకపోయినా ఆమెలో ప్రతిభాపాటవాలు నాకు తెలుసు. రాంగ్ ఎంట్రీ చేశాం కాబట్టి.. ఉమ్మడి జిల్లా ఎస్జీఎఫ్ సమాఖ్య ద్వారా, రాష్ట్రస్థాయి కార్యాలయం నుంచి జాతీయస్థాయికి కీర్తి పేరును పంపిస్తాం. అనివార్య పరిస్థితుల్లో నేను ఆ సమయంలో అందుబాటులో లేకపోవడం ఈ పాప పేరు అనుకోకుండా మిస్టేక్ జరిగిందని ఒప్పుకుంటున్నాం.. ఈ విషయంలో నేనే బాధపడుతున్నా.. ఖచ్చితంగా ఆ విద్యార్థినికి న్యాయం చేస్తాం.
కనీసం సర్వీస్ చేయడానికి కూడా రానివారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసి చేశారు. మేం ఆడి టీం విన్ అయ్యాక.. సారోళ్ల కూతురు అని, తెలిసిన వారు అని పేర్లు రాయించుకున్నారు. కనీసం గేమ్రాదు.. ఏం ఆటరాదు. ఇలాంటి వాళ్లను ఎంపిక చేస్తే మరి మేం ఏం కావాలి..? ఇలా జరగడం ఇది రెండోసారి.. అందుకే కలెక్టర్ మేడంను కలిసి మా బాధను చెప్పుకున్నాం. ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.
– ఎస్ కీర్తి, అండర్-19 వాలీబాల్ క్రీడాకారిణి