మక్తల్ : మక్తల్‌లో శుక్రవారం 10వ తరగతి ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షలు రాసే విద్యార్థుల కోసం మక్తల్ పట్టణంలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 250 మంది విద్యార్థులు, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 250 మంది విద్యార్థులు, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 280 మంది విద్యార్థులు, కేరళ పబ్లిక్ స్కూల్లో 180 మంది విద్యార్థులు, బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో 160 మంది విద్యార్థులు, అక్షర హైస్కూల్లో 270 మంది విద్యార్థులు ఇలా మొత్తం ఆరు పరీక్ష కేంద్రాలలో కలిపి 1,390 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద మక్తల్ సీఐ రామలాల్, ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డిల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఆకతాయిలు అలజడి చేయకుండా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పరీక్ష కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు 144 సెక్షన్ విధించినట్లు సీఐ తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని మండల విద్యాధికారి అనిల్ గౌడ్ చెప్పారు.
వేసవికాలం కావడంవల్ల పరీక్షా కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యంతోపాటు, వైద్య సిబ్బందిని సైతం నియమించడం జరిగిందని అధికారులు తెలిపారు. మక్తల్ కేరళ పబ్లిక్ హైస్కూల్లో ఒక అంధ విద్యార్థి సహాయకునితో పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. ఎవరైనా పరీక్ష కేంద్రాల వద్ద రూల్స్‌ను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు.