కొల్లాపూర్, ఆగస్టు 21 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (పీఆర్ఎల్ఐ) ప్రాజెక్టు డ్రైరన్‌ను నిర్వహించేందుకు సన్నద్ధమైనట్లు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి స్మితాసబర్వాల్ తెలిపారు. కొల్లాపూర్ మండలంలోని పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు ప్యాకేజీ-1, 3లో చేపడుతున్న పనులను సోమవారం ఆమె పరిశీలించారు. ప్యాకేజీ-1 టన్నెల్ మార్గంలో వెళ్లి పనులను పర్యవేక్షించారు. అనంతరం రెగుమాన్‌గడ్డ వద్ద ప్రాజెక్టు క్యాంప్ కార్యాలయానికి చేరుకొని నీటి పారుదల ఉన్నతాధికారులతో ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్మితాసబర్వాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరువుకు నిలయంగా మారిన ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగు, గ్రామాలకు తాగునీరందించేందుకు ప్రభుత్వం పీఆర్ఎల్ఐ ప్రాజెక్టును నిర్మిస్తున్నదన్నారు. వచ్చేనెల 3వ తేదీన మొదటి లిఫ్ట్‌లో డ్రైరన్ నిర్వహిస్తామన్నారు. 15వ తేదీన నార్లాపూర్ రిజర్వాయర్‌ను కృష్ణాజలాలతో నింపుతామన్నారు. అక్టోబర్ 15న ఏదుల, నవంబర్ 15న వట్టెం రిజర్వాయర్‌తోపాటు గ్రావిటీ కెనాల్ ద్వారా కరివెన రిజర్వాయర్‌కు జలాలను వదులుతామన్నారు. నెల రోజుల వ్యవధిలో దశల వారీగా పీఆర్ఎల్ఐలోని రిజర్వాయర్లను నింపేందుకు ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తుతాయా అని అధికారుల ద్వారా తెలుసుకున్నామన్నారు. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టులో పంపింగ్ విజయవంతంగా కొనసాగుతుందన్న నమ్మకం ఉందన్నారు.
తిమ్మాజిపేట, ఆగస్టు 21 : పీఆర్ఎల్ఐకి కేంద్రం పర్యావరణ అనుమతులు ఇవ్వడంతో పనుల్లో మరింత వేగం పెరిగిందని సీఎంవోఎస్డీ స్మితాసబర్వాల్ పేర్కొన్నారు. తిమ్మాజిపేట మండలంలోని గుమ్మకొండ గ్రామ పరిధిలోని పీఆర్ఎల్ఐ ప్యాకేజీ-12 పనులను ఆమె పరిశీలించారు. నీటి విడుదలకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో సాగునీటి ప్రాజెక్టుల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ మురళీధర్‌రావు, చీఫ్ ఇంజినీర్ అమీద్‌ఖాన్, మిషన్ భగీరథ సీఈ చెన్నారెడ్డి, ఈఈలు శ్రీనివాస్‌రెడ్డి, సంజీవరావు, నాగర్‌కర్నూల్ రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, మహబూబ్‌నగర్ సీఈ రమణారెడ్డి, ఎస్ఈలు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్, చక్రధర్, డీఈలు అమర్‌సింగ్, లోకిలాల్ తదితరులు పాల్గొన్నారు.