వనపర్తి, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : వనపర్తిలో కొనసాగుతున్న జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు కొంత సాఫీగా సాగిన కళాశాల ప్రస్తుతం సమస్యలకు నిలయంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా కొనసాగిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో వనపర్తికి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయించారు. 45 ఎకరాల భూమిని కళాశాలకు కేటాయించారు. రూ.4. 70కోట్లను కొన్ని నిర్మాణాల కోసం మం జూరు చేయించారు. అయినా నిర్మాణాల వైపు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెత్తి చూడటం లేదు. 2022 లో గోపాల్పేట రోడ్డులోని పీజీ కళాశాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం తాత్కాలికంగా కళాశాలను ఏర్పాటు చేసింది. ఐదు కోర్సులతో 275 మందితో మొదటి సంవత్సరం కొనసాగింది. అలాగే రెండో సంవత్సరం 269 మందితో, ప్రస్తుతం మూడో సంవత్సరంలో 290 మందితో కళాశాల కొనసాగుతున్నది. ఒకటి, రెండు సంవత్సరాల్లో కొంత సాఫీగానే నడిచింది. మూడో ఏడాదిలోకి రాగానే సమస్యల సుడిగుండంలోకి వెళ్లినట్లయ్యింది. ప్రతి యేటా విద్యార్థుల సంఖ్య పెరగడం, గదులు సరిపోకపోవడంతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇంజినీరింగ్ విద్యలో ప్రస్తుతం రెండు చోట్ల బోధనలు, మరో మూడు చోట్ల విద్యార్థులకు హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. గోపాల్పేట రోడ్డులో ఉన్న పీజీ కళాశాలలో మొదట 7గదులతో ప్రారంభించారు. మొదట్లోనే అక్కడికి సమీపంలో ఉన్న ఎస్డీడీపీఏ స్వచ్ఛంద సంస్థకు చెందిన భవణంలో బాలికలకు హాస్టల్‌ను ఏర్పాటు చేశారు. క్రమంగా విద్యార్థినులు పెరగడంతో మరోచోటుకు తరలించి కేవలం బోధనలకు వినియోగిస్తున్నారు. ఈ స్వచ్ఛంద సంస్థ భవణంలోనూ వసతులు అంతంత మాత్రమే ఉ న్నాయి. ఒకే దగ్గర బా త్రూంలు, తరగతి గదులు అన్నట్లుగా ఉండటంతో వాష్‌రూమ్స్ దుర్గందంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పీజీ భవనంతోపాటు స్వచ్ఛంద సంస్థ భవనం లో బోధనలు చేస్తున్నారు. ఇక విద్యార్థులకు హాస్టళ్ల కోసం మరో మూడు భవనాలను పట్టణంలో వివిధ చోట్ల అద్దెకు తీసుకున్నారు. ఇలా బోధనలు రెండు చోట్ల, హాస్టళ్లు మూడు చోట్ల కావడంతో విద్యార్థులు కళాశాలకు రావాలన్నా, పోవాలన్నా నరకయాతన అనుభవిస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఇంజినీరింగ్ కళాశాలకు 45 ఎకరాల భూమిని కేటాయించడంతోపాటు రూ.4కోట్ల 70లక్షలను మంజూరు చేశారు. వీటి ద్వారా రెండు అకాడమీ బ్లాకులు, మరొక వర్క్‌షాప్, రెండు బోరుబావులు, ప్రహరీ కోసం ఈ నిధులు మంజూరు చేయగా, ఆర్ఆర్ అసోసియేట్ కంపెనీ పనులను తీసుకున్నది. కొన్ని పనులను మాత్రమే మొదలు పెట్టి వదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఇంజినీరింగ్ కళాశాల పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు పదినెలల కాలంలో ఇంజినీరింగ్ కళాశాల సమస్యలపై కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని విద్యార్థులు వాపోతున్నారు.
కళాశాలలో సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు. తరగతి గదులు సరిపడా లేవు. హాస్టల్ నుంచి కళాశాలకు వెళ్లాలంటే చాలా కష్టంగా ఉంది. మొదటి సంవత్సరం తక్కువ మందిమి కావడంతో ఎలాగోలా నడిచింది. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటైనా వసతులను సమకూర్చ లేదు. సమస్యలతో విద్యార్థులంతా రోడ్డుపైకి రావాల్సి వచ్చింది. కనీస వసతులైన వాష్‌రూమ్స్, నీళ్లు కూడా లేవు. ఇలాగుంటే చదువులెలా చదవాలి. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలి.
కళాశాలలో నెలకొన్న సమస్యలను జేఎన్టీయూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అలాగే కలెక్టర్, ప్రజాప్రతినిధులకు వివరించాం. ఒకే దగ్గర పెద్ద భవనం లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. తాత్కాలికంగా పట్టణంలో మరో భవనం అద్దెకు తీసుకొని బాలికల హాస్టల్‌ను ఏర్పాటు చేశాం. మా పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం.
దాదాపు 800 మందికి పైగా కొనసాగుతున్న ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు సమస్యలతో సతమతమవుతున్నారు. పట్టణంలో హాస్టళ్లు ఉం డగా, మూడు కిలోమీటర్ల దూరంలో కళాశాల ఉన్నది. రవాణా సమస్యను గతంలో ఎమ్మెల్యే మేఘారెడ్డికి దృష్టికి తీసుకెళ్లగా, అదనపు బస్సు లు నడిపి కొన్నాళ్లకే నిలిపివేశారు.