మాగనూరు, జూలై 1 : నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా అభివృద్ధి పనులకు ఇసుకను తరలించడంలో తప్పు లేదని, ఇసుక రవాణాకు అడ్డుపడితే ఎంతటి వారైనా సహించేది లేదని చట్టపరంగా చర్య లు తీసుకుంటామని నారాయణపేట ఆర్డీవో రాంచందర్ హెచ్చరించారు. మంగళవారం మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలం పెద్ద వాగును ఆర్డీవో రాంచందర్ సీఐ రాంలాల్, తాసీల్దార్ నాగలక్ష్మి, మైనింగ్ అధికారులు, రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణం లో భాగంగా మక్తల్ మండలం కాచ్వార్ గ్రామ సమీపంలో కొనసాగుతున్న పైపుల తయారీ కేంద్రానికి మాగనూరు పెద్దవాగు నుంచి ఇసుక రవాణాను రెండు రోజుల కిందట గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో స్పందించిన రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం రాఘవ కన్స్ట్రక్షన్ ప్రతినిధులు, స్థానిక ప్రజలతో సమావేశమై పలుమార్లు చర్చలు జరిపారు.
అధికారుల రాకను తెలుసుకున్న గ్రామస్తులు పెద్దవాగు దగ్గరకు చేరుకొని పెద్దవాగు నుంచి ఇసుకను తరలిస్తే భవిష్యత్లో సాగు, తాగునీటి సమస్యలు ఎదురవుతాయ ని, ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వొద్దని ఆర్డీవోను కోరారు. మాగనూరు నుంచి బలవంతంగా ఇసుకను తరలిస్తే అడ్డుకొని పిడికెడు మన్ను కూడా తీసుకుపోకుండా అడ్డుకుంటామని వారు అధికారులకు తేల్చిచెప్పారు. ఓ వైపు మాగనూరు మండలంలో కొనసాగుతున్న టీఎస్ఎంటీసీ ఇష్టానుసారంగా ఇసుక తరలిస్తే ఏ ఒక అధికారికి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కొనసాగుతున్న ఇసుక రీచ్ నుంచి నుంచి ఎందుకు తీసుకెళ్లడం లేదని మండల కేంద్రం నుంచే ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారని అధికారులను ప్రశ్నించారు.
అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే జాతీయ రహదారిపై ఆందోళనలు నిర్వహిస్తామని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు అధికారులు, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మూడు రోజులుగా గ్రామస్తులు ఇసుక తరలించరాదని వచ్చిన అధికారులతో ఖరాకండిగా చెప్పిన పోలీస్, రెవెన్యూ అధికారులు మాత్రం మళ్లీమళ్లీ గ్రామస్తులతో చర్చలు జరుపుతుండడంతో సంబంధిత అధికారులపై గ్రామస్తులు మండిపడ్డా రు. మంగళవారం కూడా తాసీల్దార్ కార్యాలయంలో ఆర్డీ వో గ్రామస్తులతో దాదాపు గంటపాటు చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడే మాటలకు ఆర్డీవో మాత్రం వ్యంగంగా మాట్లాడుతుండడంతో ఇసుక తీసుకెళ్లరాదని గ్రామస్తులు అంటుంటే జోకులుగా అనిపిస్తుందా అంటూ ఆర్డీవోపై గ్రామస్తులు మండిపడ్డారు. ఇసుక తరలింపుపై ఆర్డీవోను వివరణ కోరగా ప్రభుత్వం చేపడుతున్న కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కావాల్సిన ఇసుక తరలింపునకు ప్రజలు అనుకూలంగా ఉండి సహకరించాలని ప్రభుత్వ భూమిలో ఇసుక తీస్తే ప్రజలకు ఏమిటి ఇబ్బందని ఆర్డీవో అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాగు కు ఇటువైపు అటువైపు 20 ఫీట్లు వదిలేసి బ్రిడ్జికి ఒక మీట ర్ దూరంలో ఇసుక తరలిస్తామని ఆర్డీవో పేర్కొన్నారు.