అలంపూర్, ఆగస్టు 6 : రేషన్ దుకాణాల్లో గత ఆరు నెలలుగా దొడ్డుబియ్యం నిల్వలతో రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగు నెలల నుంచి ప్రభుత్వం దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. వానకాలం నేపథ్యంలో మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలనే నిర్ణయంతో స్థలభావం వల్ల డీలర్లు ఇబ్బందులెదుర్కొన్నారు.
నెలనెలా వచ్చే బియ్యం స్టాక్ నిల్వ చేసుకోవడానికే ఇబ్బందులు పడుతున్న డీలర్లు ఒకే సారి మూడు నెలల బియ్యం పంపిణీ చేయవలసి రావడంతో సన్న బియ్యం నిల్వ ఉంచుకోవడానికి అవస్థలు పడ్డారు. దీనికి తోడు గతంలో పంపిణీ చేయగా మిగిలిపోయిన దొడ్డుబియ్యంతో డీలర్లు అవస్థలు చెప్పనక్కరలేదు. గత ఆరు నెలలుగా దొడ్డుబియ్యం నిల్వల కారణంగా పురుగులు పట్టి సన్న బియ్యం బస్తాలకు కూడా పడుతున్నాయని వాపోతున్నారు.
కొన్ని ప్రాంతాల్లో పంపిణీ కాక ముక్కిపోతున్నాయని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం వృథాగా ఉండి పోవడంతో ప్రజాధనం వృథా అవుతుందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. గత మార్చి నెలలో దొడ్డుబియ్యం పంపిణీ చేయగా ఏప్రిల్ నెల నుంచి తెల్ల కార్డు ఉన్న వారందరికీ ఒక్కోక్కరికీ ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు.
సన్నబియ్యం పంపిణీ మొదలైన దొడ్డుబియ్యం లెక్కలు పూర్తి కాలేదు. జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా అలంపూరు, గద్వాల రెండు నియోజకవర్గాల్లో 12 మండలాలకు గానూ సుమారుగా 2 లక్షల రేషన్ కార్డులకు గానూ 352 రేషన్ షాపులు ఉన్నాయి. వాటిల్లొ ఒక్కో షాపులో దొడ్డుబియ్యం సుమారుగా రెండు నుంచి 20 క్వింటాళ్ల నిల్వలున్నట్టు అధికారులు చెబుతున్నారు.
మూడు నెలల బియ్యం ఒకే సారి ఇవ్వాల్సి రావడంతో దొడ్డుబియ్యం నిల్వల కారణంగా సన్న బియ్యం ఎక్కడ నిల్వ ఉంచాలో తెలియక డీలర్లు సతమతమయ్యారు. స్థలం గదులు కొరత ఉన్న వారు గోదాంల నుంచి విడుతల వారీగా తెప్పించుకొని పంపిణీ చేశారు. దీం తో బియ్యం పంపిణీకి ఎక్కువ సమయం పట్టింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి దొడ్డుబియ్యం నిల్వలు క్లియర్ చేయాలని డీలర్లు కోరుతున్నారు.
అధికారులు స్పందించడం లేదు..
గత నెల బియ్యం పంపిణీలో చాలా ఇబ్బందులు ప డ్డాం. మూడు నెలల స్టాక్‌తో పాటు గతంలో మిగిలిపోయిన దొడ్డుబియ్యం నిల్వలతో గదులు పట్టక అవస్థలు ప డ్డాం. మార్చి నెలాఖరు వరకు పంపిణీ చేయగా మిగిలిపోయిన దొడ్డు బియ్యంను వెనక్కి తీసుకోపోలేదు. అధికారుల నుంచి స్పష్టత లేకపోయింది. కార్డు హోల్డర్లకు పంచమని చెప్పలేదు, స్టాక్ పాయింట్‌కు పంపమని చెప్పకపోవడంతో వాటిని ఎక్కడ ఉంచాలో తెలియక సతమవుతున్నాం. దొడ్డు బియ్యంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదు.
– వెంకటేశ్వర్లు, డీలర్, లింగనవాయి, అలంపూర్ మండలం,