బిజినేపల్లి, జనవరి 29: మండలంలోని పాలెం గ్రామంలో గల శ్రీ అలివేలుమంగ సమేత వేంకటేశ్వరస్వామి రథోత్సవాన్ని ఆదివారం తెల్లవారుజామున ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి తేరు వరకు పల్లకీలో ఊరేగించారు. అనంతరం స్వామివారు, అమ్మవారలను రథంపై ఊరేగింపు చేశారు. డప్పు వాయిద్యాలు, మేళతాలాలతో బాణాసంచాకాలుస్తూ ఆలయం నుంచి రచ్చకట్ట వరకు నిర్వహింరారు. ఈసందర్భంగా పూలమాలలు, పచ్చని తోరణాలతో రథాన్ని అలంకరించి రథోత్సవాన్ని గోవిందనామస్మరణ మధ్య కన్నుల పండువగా నిర్వహించారు.
ఈసందర్భంగా నిత్యారాధర, ప్రబంధ పారాయణం, హోమబలిహరణం, నివేదన, భక్తిగీతాల పోటీలు, ఉద్దాల మహోత్సవం, హోమం, బలిహరణం, అశ్వవాహనసేవ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు శేఖర్‌రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో రంగారావు, ఆలయ చైర్మన్ శేఖర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ లావణ్యానాగరాజు, పాలకమండలి, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా బిజినేపల్లిలో ఆనందగిరి లక్ష్మీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకన్న రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ బాలీశ్వర్, ఉప సర్పంచ్ రాములు గ్రామస్తులు పాల్గొన్నారు.