
మహబూబ్ నగర్ డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): డిగ్రీతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించడం కూడా సాధ్యమేనని నిరూపించారు మక్తల్‌కు చెందిన విద్యార్థినులు. జై మక్తల్ ట్రస్ట్ సహకారంతో సైబర్ సెక్యూరిటీ కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులకు టాప్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి. మక్తల్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ కోర్సులో ఉచితంగా శిక్షణ అందిచారు. పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో సైతం శిక్షణ ఇచ్చారు. ఇటీవల ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి పేరున్న ఐటీ కంపెనీల్లో సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నట్లు జైమక్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ మక్తాల తెలిపారు. ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ప్యాకేజీతో 15మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండటంతో..ఇండియాతోపాటు అన్నిదేశాల్లోనూ ఈకోర్సుకు మంచి డిమాండ్ ఏర్పడిందన్నారు. ప్రారంభంలోనే మంచి వేతనంతో ఐటీ కంపెనీల్లో కొలువులు సాధించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగ్నిజెంట్, టీసీఎస్‌లో ఉద్యోగాలు సాధించిన నందిని, శ్రావణి, మమతను సన్మానించారు.