గద్వాల టౌన్/అయిజ, డిసెంబర్ 22 ; ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడిని కళ్లారా దర్శించుకునే రోజు వైకుంఠ ఏకాదశి. అటువంటి పవిత్రమైన ఏకాదశి ఈ ఏడాది జనవరి 2న రాగా..మళ్లీ శనివారంతో రెండు సార్లు రావడం విశేషం. విష్ణుమూర్తికి ప్రీతిప్రదమైన ఈ పండుగ రోజుఆలయాల్లోని ఉత్తర ద్వారం నుంచి స్వామినిభక్తులు దర్శించుకుంటారు. సకల పాప నివారిణి ముక్కోటి ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాలోని వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి. రంగులు వేసి విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు.తెల్లవారుజాము నుంచే భక్తులకు దర్శనభాగ్యం కల్పించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా సూర్యుడు దక్షిణయాణం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ పండుగ వైష్ణవ భక్తులకు పరమ పవిత్రమైనది. తిరుమలలో సహా అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తరం వైపు ఉండే ద్వారాన్ని తెరుస్తారు. ఈ రోజు ఉత్తర ద్వారం మీదుగా స్వామిని దర్శించుకుంటే సకల పాప నివారిణితోపాటు వైకుంఠ ప్రవేశం చేసినంత పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరించడం తో శ్రీమన్నారాయణుడిని దర్శించుకునే భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకు వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని నిర్వహిస్తారు.
పురాణ ప్రాశస్తి
కృత యుగంలో చంద్రావతి నగరాన్ని రాజధానిగా చేసుకుని మురాసురుడనే రాక్షసుడు పాలించే వాడు. బ్రహ్మదేవుని వరంతో మురాసురుడు మహర్షుల యజ్ఞాలను ధ్వంసం చేయడంతోపాటు దేవతలను సైతం వేధించేవాడు. దీంతో వారంతా కలసి విష్ణువుతో మొరపెట్టుకోగా.. మహావిష్ణువు మురాసురుడిపై యుద్ధానికి బయలు దేరాడు. కానీ మురాసురుని సంహరించడం విష్ణువు వల్ల సాధ్యం కాకపోవడంతో అలసిపోయిన హరి బదరికా ఆశ్రమంలో విశ్రాంతి తీసుకునేందుకు ఉపశమించాడు. ఆ సమయంలో స్వామి శరీరంలో నుంచి ఏకాదశి కన్య ఉద్భవించింది. ఆ కన్య మురాసురునితో యుద్ధం చేసి వధించింది. కన్య ధైర్యాన్ని మెచ్చుకున్న స్వామి ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దీంతో కన్య తన పేరుమీద ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం ఆచరించి శ్రీమన్నారాయణుడిని కొలుస్తారో వారికి మోక్షం కలిగించి వైకుంఠ ప్రాప్తి కలిగించమని కోరుకుంటుంది. అందుకే భక్తులు ఏకాదశి రోజు ఉపవాసంతో, భక్తి శ్రద్ధలతో స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు.
వైకుంఠ ఏకాదశి విశిష్టత
చైత్ర మాసం మొదలుకుని ఫాల్గుణ మాసం వరకు ఏటా 24 ఏకాదశిలు వస్తుంటాయి. అందులో సూర్యగమనం ప్రకారం ధనుర్మాసంలో శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని, పుత్రత ఏకాదశి అని పిలుస్తారు. శ్రీహరికి ఇష్టమైన ప్రదేశం వైకుంఠం. ఇష్టమైన తిథి ఏకాదశి అలాంటి ఏకాదశుల్లో అత్యంత ప్రాధాన్యమున్నదే వైకుంఠ ఏకాదశి. సర్వధామం, ముక్కోటి ఏకాదశి అని పిలిచే ఈ ఏకాదశిని వైష్ణవాలయాలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
ఉత్తర ద్వార దర్శనం.. మోక్షదాయకం..
మహావిష్ణువుకు ప్రీతికరమైన ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం మీదుగా విష్ణువును దర్శించుకోవడం మోక్షదాయకమని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున వైకుంఠ సప్తద్వారాలు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారంగా భావించి వేకువజాము నుంచే భగవత్ దర్శనార్థం భక్తులు నిరీక్షిస్తారు. ఇదే రోజున మహావిష్ణువు గరుఢ వాహనదారుడై ముక్కోటి దేవతలతో కలిసి భూమికి దిగివచ్చి దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం. అందుకే సూర్యోదయానికి ముందే స్నాన, సంధ్యాదులు పూర్తి చేసుకుని దేవాలయానికి వెళ్లి ఉత్తర ద్వారం మీదుగా స్వామిని దర్శించుకుంటే ఆ పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం. ధనుర్మాసంలో స్వామివారిని ఉత్తర ద్వార ముఖంగా చూడాలని కూడా పెద్దలు చెబతారు.
గద్వాలలో ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం ఉత్తర ద్వార దర్శనం కోసం గద్వాల జిల్లా కేంద్రంలోని కోటలోని శ్రీ భూలక్ష్మీ చెన్నకేశవస్వామి, బుర్ధాపేటలోని గోదారంగనాథ స్వామి, పెద్ద అగ్రహారంలోని శ్రీలక్ష్మినృసింహ, గంజిపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, నదీ అగ్రహారంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాలతోపాటు జిల్లాలోని బీచుపల్లి, అలంపూర్, ధరూర్, మల్దకల్, అయిజ మండలాల్లో ఉన్న వైష్ణవా లయాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 4 గంటల నుంచే విశేష అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించ నున్నారు. 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉత్తర ద్వార ప్రవేశం ఉంటుంది. అలాగే తిరుప్పావై పారాయణం, పొంగళి నివేదన, ఆర్తి, గోష్ఠితోపాలు వివిధ పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. భక్తులు తరలిరానున్నారు.