గట్టు, అక్టోబర్ 21: పిల్లలకు మంచి భవిష్యత్ ఇచ్చే బా ధ్యత తమదేననే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించుకోవాల ని సినీనటి, పెగ టీచ్ ఫర్ చేంజ్ ఫౌండర్ మంచు లక్ష్మీప్రసన్న పేర్కొన్నారు. మండలంలోని ఆలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ క్లాస్‌రూంను సోమవారం ప్రారంభించారు. అంతకుముందు మంచులక్ష్మీకి సంస్థ సిబ్బంది, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశం లో మంచులక్ష్మి మాట్లాడారు. అక్షరాస్యతలో గట్టు వెనుకబడిందనే మాటను అందరూ తమ మదిలో నుంచి తీసివేయాలని విజ్ఞప్తి చేశారు.
గట్టు మండలంలో పిల్లల కష్టం మీద తల్లిదండ్రులు ఆధారపడుతుండడం బాధాకరమన్నారు. ఈ పద్ధ తి నుంచి తల్లిదండ్రులు దూరం కావాలని కోరారు. గట్టు మండలంలో విద్యాభివృద్ధిని తమ టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ సవాల్‌గా తీసుకోనున్నదని చెప్పారు. మండలంలోని వివిధ గ్రామాల్లో 23 స్మార్ట్క్లాస్రూంలను ఏర్పాటు చేశామని, రా బోయే రోజుల్లో మరిన్ని గ్రామాల్లో కూడా వీటిని సమకూర్చుతామన్నారు.
అన్నిదానాల్లో విద్యాదానం గొప్పదని, దీనివల్ల మేథోసంపత్తి పెరిగి కుటుంబాల జీవన ప్రమాణాల్లో స మూల మార్పు వస్తుందన్నారు. మనుషులను పక్కన పెడితే, దేవుళ్లకు కూడా కష్టాలు తప్పలేదని, అయితే వాటిని అధిగమించి భవిష్యత్‌ను బాగు చేసుకుంటేనే ఫలితం ఉంటుందన్నారు. కొందరి జీవితాలను చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటాయని, అయితే వారిని కూడా తమలో భాగస్వాములను చేసుకుని సహాయ, సహకారాలు అందిస్తే మేలు చేకూరుతుందన్నారు.
సమాజంలో చదువుకున్న విలువ దేనికిలేదని, దీన్ని గ్రహించి విద్యార్థులు చదువే లక్ష్యంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. గట్టు మండలంలో విద్యాభివృద్ధికి సహకారం అందిస్తుండడం జీవితంలో మరువలేని అంశమన్నారు. కార్యక్రమంలో పెగ సిస్టమ్స్ అధినేత ధరణికోట సుయోధన్, డీఈవో రవీందర్, విద్యాశాఖ జిల్లా సమన్వయ అధికారులు ఎస్తేర్‌రాణి, హంపయ్య, కార్యాలయ పర్యవేక్షణ అధికారి రామకృష్ణారావు, ఎంఈవో నల్లారెడ్డి, హెచ్ఎం రామన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గద్వాల, అక్టోబర్ 21: జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వపరంగా స్వచ్ఛంద సంస్థకు ఎల్లప్పుడూ పూర్తిస్థాయి సహకారం అందిస్తామని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో టీచ్ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు మంచులక్ష్మి కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లో పాఠశాలల అభివృద్ధికి ముఖ్యంగా గట్టు మండలంలో టీచ్ఫర్ చేంజ్ ఫౌండేషన్ ద్వారా పాఠశాలల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయన్నారు. ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న పాఠశాలలన్నింటిని నేరుగా సందర్శిస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో కొత్తగా 140మంది ఉపాధ్యాయులను నియమించినట్లు పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి ఉ త్తమ విద్య అందించే విధంగా విస్తృతంగా పర్యటించి పరిశీలించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి విద్యార్థులందరూ పాఠశాలకు హాజరయ్యేలా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి రాబోయే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జెడ్పీ సీఈవో కాంతమ్మ, డీఈవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.