మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జనవరి 3 : పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించే ఆటల పోటీల్లో సత్తా చాటి ప్రతిభా పాటవా లు ప్రదర్శించిన క్రీడాకారులకు మొండిచేయి చూపుతున్నారు. పైరవీలకు కొందరు అధికారులు, సి బ్బంది పట్టం కడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాపాలన ప్రభుత్వంలో క్రీడల్లోనూ ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుందని పలువురు క్రీడాకారులు వాపోతున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో గుండుమాల్ మండల కేంద్రంలోని ఏకే స్పోర్ట్స్ అకాడమీ క్రీడా మైదానంలో డిసెంబర్ 9 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రస్థాయి అండర్-19 పోటీలు జరిగాయి. ఈ టోర్నీలో రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల క్రీడాకారులతో పాటు దేశ నలుమూలల నుంచి (21 రాష్ర్టాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఏడు కేంద్ర విద్యా సంస్థలకు చెందిన) 32 జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నీలో సత్తా చాటిన ఎందరో క్రీడాకారుల పేర్లు తుది జాబితాల్లో తారుమారు అయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ పోటీల్లో మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని టీజీ ఆర్జేసీ గురుకుల విద్యాలయం విద్యార్థినులు పాల్గొని సత్తాచాటారు. టీజీ ఆర్జేసీ విద్యార్థిని కీర్తి జాతీయ అండర్-19 వాలీబాల్ జట్టులో స్థానం సంపాదించినట్లు పర్యవేక్షకులు, సెలెక్షన్ కమి టీ సభ్యులు రాతపూర్వకంగా ఈనెల 12న ఫైనల్ జాబితా ప్రకటించారు. సదరు విద్యార్థిని పాఠశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులంతా అభినందించారు.
కీర్తి తాను జాతీయ జట్టులో ఆడేందుకు ఎంపికైనట్లు తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించి తన సంతోషాన్ని పంచుకున్నది. ఈ నేపథ్యంలోనే అధికారులు వెల్లడించిన ఆన్లైన్ జాబితాలో తన పేరు లేకపోవడాన్ని షాక్‌కు గురైంది. ప్రతిభావంతురాలైన క్రీడాకారిణికి మొండిచేయి చూపి ఆన్లైన్లో మరో క్రీడాకారిణి పేరును ఫైనల్ జాబితాలో చేర్చారు. అండర్-17లోనూ తనకు అన్యాయం జరిగినట్లు మరో క్రీడాకారిణి నందిని తెలిపింది.
మహబూబ్‌నగర్ జిల్లాలోని భూత్పూరు మండలం వేములలో నిర్వహించిన క్రీడల్లో సత్తాచాటిన ఆమెకు కరీంనగర్ జిల్లాలో నిర్వహించే పోటీలకు ఎంపికైనట్లు ముందుగా పేరు ప్రకటించినా.. ఆ తర్వాత పేరును తొలగించినట్లు వాపోయింది. వీరితోపాటు మరికొందరి పేర్లు గల్లంతైనట్లు సమాచారం. అయితే మా పేర్లు తొలగించి ఇతరుల పేర్లు చేర్చిన క్రీడాకారులు అసలు మైదానంలో బరిలోకే దిగలేదని పలువురు క్రీడా కారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఉమ్మడి జిల్లా ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ పాపిరెడ్డిని ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.