జోగులాంబ గద్వాల : అలంపూర్ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం ( Injustice ) చేస్తోందని ఎంఆర్పీఎస్ (MRPS) జాతీయ సీనియర్ నాయకుడు కొంకల భీమన్న ( Kokanka Bheemanna ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న అలంపూర్లో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో ఒక్క మండల అధ్యక్ష పదవిని కేటాయించకపోవడం స్థానిక మాదిగ సమాజాన్ని అవమానించడమేనని మండిపడ్డారు.
నియోజకవర్గంలో పార్టీ విజయానికి వెన్నుముకగా నిలిచిన మాదిగలను పక్కన పెట్టడం వెనుక స్థానిక కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి నిర్లక్ష్యం ఉందా ? జిల్లా పార్టీ అధిష్టానం కావాలనే విస్మరించిందా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం మాదిగలను వాడుకుని, పదవుల పంపకాలకు వచ్చేసరికి మొండిచేయి చూపించడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలకు నిదర్శనమని విమర్శించారు.
క్షేత్రస్థాయిలో పార్టీ కోసం దశాబ్దాలుగా జెండాలు మోసిన మాదిగ నాయకులను విస్మరించడం వల్ల సమాజంలో తీవ్ర అసంతృప్తి నెలకొందని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర , జిల్లా నాయకత్వం తక్షణమే స్పందించి అలంపూర్ నియోజకవర్గంలో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరారు.