బిజినేపల్లి, సెప్టెంబర్ 14: పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడన్న నెపంతో ఓ విద్యార్థిని ప్రిన్సిపాల్ కర్రతో చితకబాదిన ఘటన మండలకేంద్రంలో చోటు చేసుకున్నది. విద్యార్థి తల్లిదండ్రులు కథనం ప్రకారం మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన సురేందర్ బిజినేపల్లిలోని మేధాంస్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం పాఠశాలకు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చాడన్న కారణంగా సురేందర్‌ను ప్రిన్సిపాల్ రమేశ్ కర్రతో తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
గాయాలు తాళలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని, విషయం తెలుసుకున్న స్నేహితులు బైక్‌పై గౌరారం గ్రామానికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. తీవ్ర గాయాలతో వణుకుతున్న విద్యార్థి ఒంటిపై గాయాలు చూసి తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. అకారణంగా తమ కుమారుడిని తీవ్రంగా కొట్టిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈమేరకు ఎంఈవోలు, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.