ఉండవెల్లి, మే 13: నాసిరకం విత్తనాలను రైతులకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ పేర్కొన్నారు. నాసిరకం పత్తి విత్తనాలు విక్రయిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించిన ఘటనపై ఉండవెల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మండలంలోని ఇటిక్యాలపాడుకు చెందిన రామచంద్రారెడ్డి, నర్సింహారెడ్డి నాసిరకం పత్తి విత్తనాలు విక్రయిస్తుండగా బుధవారం అధికారులు పట్టుకున్నారు.
నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూర్కు చెందిన రావూరి వెంకటరావు పల్లవి, కావ్య, పావని కంపెనీ పేర్లతో నాసిరకం పత్తి విత్తనాలను తయారుచేసి రామచంద్రారెడ్డి ద్వారా ఉండవెల్లి, మానవపాడు మండలాల్లోని వివిధ గ్రామాల్లో విక్రయించారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సీఐ, ఎస్సై బ్రాహ్మణకొట్కూర్లోని సింహాద్రి కోల్డ్‌స్టోరేజీలో 15క్వింటాళ్ల 32కిలోల 700గ్రాములు, పోతులపాడులోని రైతుల వద్ద నుంచి 75కిలోల 600గ్రాములు (మొత్తం 3.800పత్తి విత్తనాల ప్యాకెట్లు), ప్యాకేజీ మిషన్, ప్యాకింగ్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నాసిరకం పత్తి విత్తనాల విలువ రూ.30లక్షల వరకు ఉంటుందని ఎస్పీ వివరించారు. నాసిరకం పత్తి విత్తనాలను తయారుచేసి విక్రయిస్తున్న రావూరి వెంకటరావు, రామచంద్రారెడ్డి, నర్సింహారెడ్డి, మల్లికార్జున్‌లపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. రైతులు బిల్లులు లేకుండా విత్తనాలను కొనుగోలు చేయొద్దన్నారు. గ్రామాల్లో నాసిరకం విత్తనాలు విక్రయిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ రంగస్వామి, సీఐ సూర్యనాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.