నారాయణపేట, ఫిబ్రవరి 25: సీతారాముల వారు ఒక్కటయ్యారు.! నారాయణపేటలోని జీపీ శెట్టి ఫంక్షన్హాల్లో సీతారామస్వామి కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, స్వాతిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా హనుమాన్ ఉపాసకుడు శ్రీనివాసరావు సుందరకాండ కథాగానం చేపట్టారు. చివరిరోజైన శనివారం సీతారామస్వామి కల్యాణం, రాముడి పట్టాభిషేకం వైభవంగా జరిపించారు.
అంతకుముందు రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులను పట్టణంలోని గొడుగుగేరి హనుమాన్ ఆలయం నుంచి ఫంక్షన్‌హాల్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం రుత్వికుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య రాములవారు సీతమ్మ మెడలో తాళి కట్టారు. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.