Achampet | అచ్చంపేట రూరల్, జూన్ 24 : తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్దపీఠ వేస్తున్నామని చెబుతున్నా అవి ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. మంగళవారం నమస్తే తెలంగాణ ప్రతినిధి మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో స్పాట్ విజిట్ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మండలానికి దాదాపు 75 కిలో మీటర్ల దూరంలో ఉన్నా ఏజెన్సి గ్రామాల్లో సర్కార్ బడుల్లో విద్య పేద విద్యార్థులకు అందని ద్రాక్షగానే మిగిలిందని చెప్పవచ్చు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లమల ఏజెన్సీ ప్రాంతంలో పేద విద్యార్థులుకు సర్కారు విద్య అందని మిథ్యగా మారింది. ఆర్టీసీ బస్సు అచ్చంపేట, దేవరకొండ డిపోల నుండి వస్తేనే బడి లేదంటే అప్రకటిత హాలిడే ఇక్కడ అమలవుతుంది. మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో పనిచేసే ఉపాధ్యాయులు గత కొన్ని దశబ్దాల నుండి ఆర్టీసీ బస్సును నమ్ముకొని ఉపాధ్యాయ కొలువులు చేస్తున్నారు. ఉదయం ఆర్టీసీ బస్సుకు పోవడం మళ్లీ తిరుగు ప్రయాణంలో బడికి తాళం వేసి ఆయాకు తాళం అందించి అందిన వాహనంలో తమ ఇంటికి చేరుకోవడం ఇదే తంతు నడుస్తుంది. సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలో అత్యవసరంగా సెలవు పెట్టుకుంటే ఆ రోజు బడి బంద్.. విద్యార్థులకు అప్రకటిత సెలవు. ఒకవేళ టీచర్ బడికి రావాలంటే ఆర్టీసీ బస్సు రావాలి. అది సమయంతో సంబంధం లేకుండా బస్సు ఎప్పుడు వస్తే అప్పుడే బడి తలుపులు తెరుచుకుంటాయి. సమయ పాలన లేదు.. ప్రార్థన అంతకంటే ఉండదు. ఇలా జరుగుతుందంటే కేవలం విధ్యాధికారుల పర్యవేక్షణ లోపమే అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామంలో టీచర్లపై నమ్మకం లేదని వారు ఎప్పుడు వస్తారో తెలియదని బస్సు వస్తేనే వారు వస్తారు వచ్చిన టైం పాస్ గా కాలక్షేపం చేసి మూడు గంటలకే వెళ్ళి పోవడం జరుగుతుందన్నారు.
నల్గొండ జిల్లా చందంపేట మండల పరిధిలోని సెంటర్లో ప్రైవేటు పాఠశాలకు తమ పిల్లలను పంపిస్తున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ విద్యార్థి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఉదయం ఆరు గంటలకు ప్రైవేటు బస్సు పిల్లలను ఎక్కించుకోని భద్రంగా మళ్ళీ ఆరు గంటలకు సాయంత్రం తీసుకోచ్చి తమ ఇంటి దగ్గర దింపుతున్నారని సర్కారు టీచర్లు మంచిగా సదువు చెబితే తాము ప్రైవేటుకు ఎందుకు పంపిస్తామని ప్రశ్నిస్తున్నారు. బక్కలింగయ్యపల్లిలో పనిచేసే టీచర్ పాఠశాలకు సెలవు పెట్టడంతో విద్యార్థులు చెసేదిలేక తాళం వేసిన బడిముందు బ్యాగులతో కూర్చున్నారు. అలాగే ఘణపూర్లో బస్సు అరగంట ఆలస్యంగా రావడంతో.. టీచర్ లేక ఇద్దరు పిల్లలు పాఠశాల ఆవరణంలో ఉన్నారు. ఇక్కడి విద్యార్థులకు గుడ్డి గుర్తు ఆర్టీసీ బస్సులు వస్తేనే బడి లేదంటే సెలవని అర్ధం. ఇప్పటికైనా విధ్యాధికారులు దృష్టిసారించి సర్కారు బడుల్లో పనిచేసే టీచర్లు సమయ పాలన పాటించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.