అమరచింత, జూన్ 28 : తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు, అమరచింత ముద్దుబిడ్డ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సాయిచంద్ రెండో వర్ధంతి ఆదివారం అమరచింతలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన సాయిచంద్ ఏడడుగుల కాంస్య విగ్రహాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించనున్నారు. అనంతరం సాయిచంద్ చదువుకున్న పాఠశాల గ్రౌండ్లో భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లును వారం రోజులుగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్పర్సన్ రజినీసాయిచంద్ దగ్గరుండి చూస్తున్నారు.
బహిరంగసభకు పదివేల మందిని తరలించేందుకు స్థానిక నాయకులతోపాటు వివిధ గ్రామాల్లోనూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. శనివారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్పర్సన్ రజినీసాయిచంద్ విగ్రహావిష్కరణకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం సాయిచంద్ విగ్రహావిష్కరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, లక్ష్మారెడ్డితోపాటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డితోపాటు పలువురు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన కళాకారులతో ధూంధాం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు చెందిన కళాకారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సాయిచంద్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విగ్రహాష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. వారి వెంట బీఆర్ఎస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.