
మహబూబ్నగర్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనాతో ప్రపంచం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వ్యవస్థలన్నీ కునారిల్లిన తరుణంలో ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇలాంటి సంకట స్థితిలోనూ తెలంగాణ సర్కార్ మాత్రం అన్నదాతకు దన్నుగా నిలుస్తున్నది. రైతన్నకు చిన్న ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. వానకాలం రైతుబంధు పెట్టుబడి ఈ ఏడాది జూన్ 15 నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయగా.. యాసంగి పెట్టుబడి సాయం కూడా ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నది. సాధ్యమైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గతంలో ఉన్న నిబంధనల మేరకే కేటగిరీల వారీగా డబ్బులు జమ కానున్నాయి. మొదట సన్న, చిన్నకారు రైతుల నుంచి ప్రారంభించి.. తర్వాత ఎక్కువ సంఖ్యలో భూమి ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు పడనున్నాయి. ఈ నెలాఖరు వరకు రైతుబంధు సాయం పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత వానకాలంలో 9,23,393 మంది రైతుల ఖాతాల్లో రూ.1217.52 కోట్లు జమయ్యాయి. ఈసారి ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. రైతుబంధు సాయం కింద ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు పంపిణీ చేస్తున్నది. దేశంలో తొలిసారిగా రైతులకు నగదు సాయం పథకం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఆ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. 2018 వానకాలం సీజన్ నుంచి ప్రారంభం కాగా.. ఏడాదికి రెండు సార్ల చొప్పున ఒక్కో పంటకు రూ.4 వేలు ఇచ్చారు. 2019 వానకాలం నుంచి ఎకరాకు రూ.5 వేల చొప్పున.. ఏడాదికి రూ.10 వేల సాయం అందిస్తున్నారు. ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నా.. వెనక్కి తగ్గకుండా పథకాన్ని అమలు చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో భూమి ఖాతాల ప్రకారం పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ విభాగంలోకి మారిన రైతులు కొత్తగా అర్హుల జాబితాలోకి వచ్చే అవకాశం ఉన్నది.
ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి..
ఒకప్పుడు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చే సేందుకు గంజికి వెళ్లి.. అక్కడ వ్యాపారి వద్ద అప్పులు చేయాల్సి వచ్చే ది. పండించిన పంటను సదరు వ్యాపారికే అమ్మాల్సిన దుస్థితి ఉండేది. దీం తో చేసిన అప్పుకు వడ్డీ, కమీషన్లు కూడా వసూలు చేసేవారు. పంటకు ధర ఎక్కువగా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ, రైతుబంధు ప్రారంభమయ్యాక గంజి వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి పోయింది. పంట ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు గంజిలోని వ్యాపారులే రైతు ముంగిటకు వచ్చేలా మార్పు వచ్చింది. గతంలో బ్యాంకుల్లో కూడా అప్పులు పేరుకుపోయేవి. ఇప్పుడు దాదాపుగా ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్ష నేతలు కూడా గతంలో వ్యవసాయం చేసేందుకు బ్యాంకుల్లో బయట అప్పులు చేసే పరిస్థితి ఉండేది. వారికి కూడా రైతుబంధు సాయం అందుతున్నది. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.
పండుగలా వ్యవసాయం..
మా మండలంలో బో ర్లు, బావులు ఎండిపోయి ఉన్న కొద్దిపాటి నీటిని పొలాల్లోకి మళ్లించుకునేందుకు కరెంట్ లేక.. వ్యవసాయం చేయలేక ఊరిని వదిలి వలసవెళ్లేవారు. కానీ ఇప్పుడు నిరంతర ఉచిత విద్యుత్, పంట సాయం, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇలా అన్ని విధాలుగా ప్రభుత్వం సాయం చేస్తున్నది. వ్యవసాయం పండుగలా చేసుకుంటున్నాం గతంలో వలసవెళ్లిన అన్నదాతలంతా తిరిగొచ్చి సంతోషంగా సొంత ఊరిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. కుటుంబంతో కలిసి హాయిగా బతుకుతున్నారు. ఇంతటి మార్పునకు రైతుబంధే కారణమైంది. రైతులు బాగు చేసే ప్రభుత్వం వల్లే ఇది సాధ్యం.