బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొనడంతో జనం విస్మయం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఎన్నికలు నిర్వహించలేక చేతులు ఎత్తేసిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేసి.. ఇప్పుడు బంద్‌లో పాల్గొనడంతో జనం నవ్వుకున్నారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా పాల్గొనడం వెనుక బీసీలను మోసం చేయడమేనని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఈ జాతీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. మొత్తంపైన ఈ బంద్‌కు అధికారపక్షం కూడా మద్దతు తెలియజేయడంపై పలు రకాల చర్చలు నడిచాయి. బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించకపోతే కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని బీసీ సంఘాలు హెచ్చరించాయి.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ బంద్ విజయవంతమైంది. బీసీల 42 శాతం రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించాలని, వాటి ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ ఉమ్మడి పాలమూరు జిలాలో ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల పాక్షికంగా జరగగా.. మరికొన్ని చోట్ల సంపూర్ణంగా నిర్వహించారు. ప్రధాన విపక్షమైన బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో శనివారం తెల్లవారుజామునే గులాబీ పార్టీ శ్రేణులు ఆయా ఆర్టీసీ బస్ డిపోల వద్దకు చేరుకొని బైఠాయించారు. దీంతో బస్సులు బయటకు రాకుండా డిపోలకే పరిమితమయ్యాయి. బస్టాండ్లన్నీ బోసిపోయాయి. రోడ్లన్నీ నిర్మానుశ్యంగా మారాయి. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. అత్యవసర ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు.
విద్యా, వ్యాపార, వాణిజ్య సముదాయాలను వ్యాపారులు ఉదయం నుంచే స్వచ్ఛందంగా మూసివేశారు. పెట్రోల్ బంకులు, చిన్నచిన్న కిరాణ కొట్లు సైతం బంద్‌కు సహకరించాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీతో పాటు బీఆర్ఎస్ నాయకులు కలిసి బంద్‌ను సక్సెస్ చేశారు. పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీసీ సంఘాలు, అఖిలపక్షం నేతలు ధర్నాలకు దిగారు. పాలమూరులో తెల్లవారుజామున 5 గంటలకే మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బస్టాండ్ వద్దకు చేరుకొని నిరసనలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్-రాయిచూర్ హైవేపై మక్తల్, టైరోడ్డు వద్ద, హైదరాబాద్-
బెంగళూర్ హైవేపై ఆందోళనలు కొనసాగాయి.
జడ్చర్ల పట్టణంలోని సిగ్నల్‌గడ్డ వద్ద హైవే 167పై వద్ద బీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపైనే అల్పాహారం చేస్తూ వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. దీంతో 2 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలేపల్లి సెజ్‌లోని వివిధ కంపెనీలకు ఉద్యోగాలను తరలించే బస్సులను అడ్డుకొని నిలిపివేయించారు. సిగ్నల్‌గడ్డ వద్ద ఉన్న ఆరాధ్య సూపర్ మార్కెట్ తెరిచి ఉంచడంతో రాళ్లు విసిరారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు.
కల్వకుర్తిలో బీసీ సంఘాల నాయకులు పట్టణంలో చేపట్టిన బైక్ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలో కూడా ప్రశాంతంగా కొనసాగింది. అసలే సోమవారం దీపావళి పర్వదినం కావడంతో చాలామంది సొంతూర్లకు వెళ్లేందుకు
బస్సుల్లేక ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల మధ్యాహ్నం 3గంటల తర్వాత బస్సులు రోడ్లపైకి వచ్చాయి. బంద్ విజయవంతం కావడంతో సహకరించిన వారందరికీ బీఆర్ఎస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
రిజర్వేషన్లు ఇచ్చే వాళ్లే ధర్నా చేస్తారా..?
మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 18 : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చే ప్రధాన పార్టీలే బీసీ బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. బీసీల రిజర్వేషన్లు ఇచ్చినట్టే చేసి నోటికాడిముద్ద లాక్కున్నారని విమర్శించారు. శనివారం బీసీ బంద్ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉదయం 5గంటలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రీనివాస్‌గౌడ్ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
రిజర్వేషన్లను అమలు చేయాల్సిన రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు బిల్లుకు ఆమోదం తెలుపకుండా పక్కకు పెట్టి బీసీలను మోసం చేస్తూ బంద్‌కు మద్దతుగా ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వీరి కపట రాజకీయాలను మేధావులు, ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రెండు పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేసి రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్లుకు ఆమోదం పొందేలా చూడాలన్నారు. ఈ మేరకు బీసీలకు రాజకీయం, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. చట్ట సవరణ చేయకుండా రిజర్వేషన్లు సాధ్యం కాదని బీఆర్ఎస్ పార్టీ చెప్పినా వినకుండా కాంగ్రెస్ సర్కారు ముందుకెళ్లిందన్నారు.
రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థలో లక్కీడిప్ తీయడంతో ఇప్పటికే గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయని ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టారని వెల్లడించారు. ఎంబీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి మంత్రి పదవులతోపాటు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమానికి పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ అనేక కార్యక్రమాలు చేపట్టి.. ప్రత్యేక కార్పొరేషన్, పేదలకు రుణాలు, బీసీ విద్యార్థులకు గురుకులాలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. చట్టబద్దంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించే వరకు మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బంద్ తర్వాత అన్ని పార్టీల నాయకులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివ
రాజ్, గణేశ్, ఆంజనేయులు, శ్రీనివాస్‌రెడ్డి, రాము, నవకాంత్, నరేందర్, సుధాకర్, శివ, సాయిలు తదితరులు పాల్గొన్నారు.