వైరా టౌన్/ మధిర/ పాల్వంచ, ఏప్రిల్ 6: రాష్ట్రంలో చాలా బస్టాండ్లు 20 నుంచి 40 ఏళ్ల పైబడినవేనని, అందుకని.. వాటిని కూల్చివేయకుండా జాగ్రత్తగా నిర్వహించుకుంటూ వెళ్తుంటామని ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ నాగిరెడ్డి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం పర్యటించిన ఆయన.. వైరా, మధిర, పాల్వంచ బస్టాండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బస్టాండ్ల అభివృద్ధికి ఏమేమి చేయొచ్చో పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రద్దీ బస్టాండ్లను అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేయడం తమ బాధ్యత అని అన్నారు. అదేవిధంగా, నాన్ ట్రాఫిక్ రెవెన్యూ సాధించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయోమో పరిశీలించనున్నట్లు తెలిపారు.
ఈ వేసవిలోనే స్మార్ట్ కార్డులను ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. వైరా బస్టాండ్ నుంచి రోజుకు సగటున 35 వేల నుంచి 40 వేల వరకూ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, ఇలాంటి బస్టాండ్‌ను మరింత మెరుగ్గా నిర్వహించుకోవడం తమ బాధ్యతని అన్నారు. బస్టాండ్ నిర్మాణానికి తమ వద్ద బడ్జెట్ ఉండదన్నారు. అనంతరం.. మధిర తాత్కాలిక బస్టాండ్‌ను, డిపోను, నూతన బస్టాండ్ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యమని, బస్సుల ఫిట్నెస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తరువాత పాల్వంచ బస్టాండ్‌ను, అక్కడి వసతి సౌకర్యాలను పరిశీలించారు. అయితే, పార్కింగ్ స్టాండ్, మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడం వల్ల ప్రయాణికలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్ సింధు తపస్వి.. ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, బూర్గంపహాడ్ బస్టాండ్‌ను కూడా వినియోగంలోకి తేవాలని సామాజిక కార్యకర్త ఎడ్లపల్లి శ్రీనివాస్.. ఆర్టీసీ ఎండీని కోరారు. కరీంనగర్ జోన్ ఈడీ సోలోమాన్, ఖమ్మం ఆర్ఎం డిప్యూటీ ఆర్ఎం మల్లయ్య, డీఎంలు ఆర్.రామయ్య, రాజ్యలక్ష్మీ, సీఐ సతీశ్, ఎస్సై తోట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.