మహబూబ్‌నగర్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి); ఉపరితల ద్రోణి కారణంగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావాసులు హైరానా పడుతున్నారు. నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, పాలమూరు జిల్లాల్లో శుక్ర, శనివారం వర్షం దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. పంట చేలను వర్షపునీరు ముంచెత్తింది. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు మత్తడి దుంకాయి. రోడ్లు, కల్వర్టులు తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
నాగర్‌కర్నూల్ జిల్లాలోని దుందుభీ నది పరవళ్లు తొక్కింది. కొన్ని ప్రాం తాల్లో వరద తగ్గుముఖం పట్టాక వాహనాలను పోలీసులు అనుమతించారు. పలు చోట్ల ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు చిన్నపాటి కుంటను తలపించాయి. మట్టిమిద్దెలు కూలిపడ్డాయి. గద్వాలలో ఇల్లు కూలిపోగా ఇద్దరికి గాయాలయ్యాయి. రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జిలోకి నీళ్లు చేరాయి.
అయిజలో రాష్ట్రంలోనే అత్యధికంగా 109 మి.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పాడు బడిన ఇండ్లల్లో నివసించరాదని, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా రాఖీ పండుగ సందర్భంగా పలువురు తోబుట్టువులు తల్లిగారిండ్లకు ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ప్రజలను పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు.