అచ్చంపేట, ఏప్రిల్ 29 : నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయ చర్యలు నిలిచిపోయాయి. చేపట్టేందుకు ఎలాంటి పనులు లేకపోవడంతో రెస్క్యూ టీంలు, అధికారులు వెళ్లిపోగా.. మిగిలిపోయిన ఆ యా విభాగాల సిబ్బంది ఖాళీగా ఉంటున్నారు. టన్నెల్లో ప్రమాదం జరిగి మంగళవారంతో 67 రోజులైంది. ప్రస్తుతం టన్నెల్లో హైడ్రా, రైల్వే, ఎస్డీఆర్ఎఫ్, మొబైల్ టాయ్లెట్ సిబ్బంది మొత్తం 80 మంది వరకు ఉన్నారు.
వారందరికీ భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆయా విభాగాల సిబ్బంది వెళ్లిపోగా మిగిలిన సిబ్బంది కూడా వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. సొరంగంలో చేసేందుకు పనుల్లేక సిబ్బందిని ఖాళీగా ఉంచడంపై సిబ్బంది పెదవి విరుస్తున్నారు. ఇక్కడికి వచ్చిన అన్ని విభాగాల సిబ్బంది వెళ్లిపోయాక మమ్మల్ని ఎందుకు ఉంచారని ప్రశ్నిస్తున్నారు. దాదాపు రెండు నెలలకుపైగా కుటుంబాలకు దూరంగా ఉండి సహాయ చర్యల్లో పాల్గొన్నామని, ప్రస్తుతం చేసేందుకు పనులు లేనందున వెంటనే తమను పంపించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కేవలం డీవాటరింగ్ ప్రక్రియ మాత్రమే కొనసాగుతోంది.