వనపర్తి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్‌లోని యంత్రాలపై ఎలుకలు దాడి చేశాయి. దీంతో జిల్లాలోని 14 పీహెచ్‌సీలతోపాటు జిల్లా కేంద్ర దవాఖానకు వచ్చే రోగులకు వివిధ పరీక్షలు చేయడం ఈ కేంద్రం ద్వారా నిలిచిపోయాయి. దాదాపు రెండు నెలలకు పైగా ఈ అసౌకర్యం ఏర్పడినా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించడం లేదు. సర్కార్ దవాఖానలంటే మళ్లీ సమ స్య మొదటికి వస్తున్నట్లుగా కనిపిస్తుంది. గతంలో తెలంగాణ ఏర్పడక ముందు నేను రానో బిడ్డో సర్కార్ దవాఖానకు అన్న సినీ గేయం మళ్లీ గుర్తుకు వస్తుంది. అలాంటి పరిస్థితుల నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పటిష్టంగా దవాఖానలు, అన్ని రకాల ఆరోగ్య చికిత్సలను అందుబాటులోకి తెచ్చి నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని వినియోగంలోకి తెచ్చిన సంగతి విధితమే. ప్రస్తుతం నిరుపేదలకు సరైన చికిత్సలు అందించడంలో సర్కారు దవాఖానలు దూరమవుతున్నట్లు కనిపిస్తున్నది.
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ వెనకి భాగంలో ఉన్న టీ హబ్ కేంద్రంలోని వివిధ యంత్రాలపై ఎలుకలు దాడి చేసి వైర్లను కట్ చేశాయి. ఇది జరిగి దాదాపు రెండు నెలలకు పైగానే అయింది. దీనిని మరమ్మతులు చేయించేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లా పరిధిలో ఉండే దవాఖానలతోపాటు జిల్లా కేంద్ర దవాఖానకు వచ్చే రోగులకు అవసరమైన పరీక్షలు చేసి నిర్ధారణ అనంతరం ఆయా పరీక్షలను తిరిగి సంబంధిత దవాఖానలకు పంపడం నిత్యం జరుగుతూ వస్తుంది. జిల్లా మొత్తంగా ప్రతి రోజూ 2 వేలలోపు షాంపిల్స్ ఈ కేంద్రానికి వస్తుంటాయి. వీటిలో సగం వరకు బయోకెమిస్ట్ ల్యాబ్‌కు సంధించిన పరీక్షలవే ఉంటాయి. మిగితావి ఇతరత్రాలుంటాయి. ఇదిలా ఉంటే, 134 రకాల పరీక్షలను నిర్వహించుకునేలా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ పరీక్షలు చేయడంపై నిర్లక్ష్యం కొనసాగుతుంది.
జిల్లా కేంద్రంలోని టీ హబ్‌లో బయో కెమిస్ట్రి ల్యాబ్ పనిచేయక పోవడంతో దాదాపు 20 రకాల పరీక్షలకు అంతరాయం ఏర్పడింది. దీని వల్ల సాధారణ షుగర్ పరీక్షల నుండి కాల్షియం,యూరిక్ యాసిడ్,విటమిన్ డీ, విటమిన్ బీ 12, ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ, లిఫిడ్ ప్రోఫైల్, లైఫేజ్, అమిలైజ్లాంటి తదితర పరీక్షలకు సమస్యగా ఉంది. దీంతోపాటు థైరాయిడ్ పరీక్షలు దాదాపు ఆరు నెలలుగా పని చేయడం లేదు. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. థైరాయిడ్‌లో ఉన్న మూడు పరీక్షలు కూడా అటకెక్కాయి. టీ3, టీ4, టీఎస్‌హెచ్ ఈమూడు రకాలు పరీక్షలు నిలిచిపోయాయి. కిడ్నీ పరీక్షలతోపాటు బ్లడ్ ర్యాండమ్ షుగర్ పరీక్షలకు రాంరాం పలికారు. పని చేయని యంత్రాల సమాచారం సహితం గోప్యత పాటిస్తున్నారు. థైరాయిడ్ సమస్యలతో అనేక మంది పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు.అత్యవసరం ఉన్నప్పుడల్లా ప్రైవేట్‌కు వెళ్లి నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు.
వనపర్తి కేంద్రంలోని టీహబ్‌లోని యంత్రాలపై ఎలుకలు దాడి చేయడంతో నిలిచిన సేవలను మహబూబ్‌నగర్‌కు పంపించి చేయిస్తున్నామని సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో సమయానికి అందాల్సిన పరీక్షల నిర్ధారణలు మూడు రోజుల సమయం తీసుకుంటున్నందునా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా రోజు వారీగా వచ్చే షాంపిల్స్‌ను పరీక్షలు చేసి తిరిగి ఆయా దవాఖానలకు,అలాగే పరీక్షలు చేయించుకున్న వారి ఫోన్‌కు మెసేజ్ ద్వారా పంపిస్తారు. పాలమూరుకు పంపించి చేయిస్తున్నామని చెబుతున్నా.. సమయానికి అందకపోవడంతో రోగులు అవస్థలపాలవుతున్నారు.
జిల్లా కేంద్రంలోని టీ హబ్ కేంద్రంలో కెమిస్ట్ పరీక్షలకు అంతరాయం కల్గింది. ఎలుకలు వైర్లను కట్ చేయడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. దీనిపై కంపెనీ యజమాన్యంతో మాట్లాడాం. రెండు, మూడు రోజుల్లో పని చేయని యంత్రాలను వినియోగంలోకి తెస్తాం. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌కు పంపించి పరీక్షలు చేయిస్తున్నాం. త్వరగానే వనపర్తిలోని టీ హబ్‌లోనే పరీక్షలను పునరుద్ధరిస్తాం.
– జి సాయినాథ్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి, వనపర్తి