Prajavani | ప్రజావాణి కార్యక్రమంలో వివిధ అంశాలూ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని అధికారులను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో యాదయ్యతో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 53 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదర్శ్ సురభి ఆదేశించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక అధికారులు వసతి గృహాలను పర్యవేక్షించాలని ఆదర్శ్ సురభి తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. అక్కడ విద్యార్థులకు ఉన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆ ఆదేశాల్లో కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో ఉపాధి హామీ సిబ్బందికి పని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.