జడ్చర్లటౌన్, నవంబర్ 20 : చిత్తూర్ నుంచి హైద రాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కారును ఓవర్టేక్ చేసే యత్నంలో ముందు వెళ్తున్న కెమికల్ (యాసిడ్) లోడ్ ట్యాంకర్‌ను ఢీకొన్న ఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మా చారం గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై చోటుచేసుకున్నది. జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జగన్ ట్రావెల్స్ బస్సు చిత్తూర్ నుంచి హైదరాబాద్‌కు చెందిన 30 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. గురువారం తెల్లవారుజామున 5:30 గంటల సమయానికి ట్రావెల్స్ బస్సు జడ్చర్ల మండ లం మాచారం వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిపై వెళ్తుండగా కారును ఓవర్టేక్ చేసే యత్నంలో ముందు వెళ్తున్న హైడ్రోఫోర్లిక్ కెమికల్ లోడ్ ట్యాంకర్‌ను ఢీకొంది.
దీంతో ట్యాం కర్ నుంచి కెమికల్ యాసిడ్ లీకై రోడ్డు మీద పడటం తో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. వెంటనే బస్సులోని ప్రయాణికులందరూ అప్రమత్తమై బస్సు వెనుక నున్న ఎగ్జిట్ డోర్ నుంచి కిందికి దిగారు. కెమికల్ యాసిడ్ నుంచి మంటలు వ్యాపించకపోవడంతో అక్కడున్న వారందరూ ఊపీరి పీల్చుకున్నారు. అయితే యాసిడ్ మంటలు వ్యాపించితే మాత్రం పెను ప్రమాదం జరిగి ఉండేందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జడ్చర్ల సీఐ కమలాకర్‌తో పాటు అగ్నిమాపక బృందం, పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. కెమికల్ యాసి డ్ లీకై రోడ్డుపై పడుతుండగా వెంటనే అగ్నిమాపక బృందం దానిపై నీటిని చల్లారు. ప్రమాదానికి కారణమైన బస్సులోని ప్రయాణికులకు ఇతర ట్రావెల్స్ కు చెందిన బస్సుల్లో ఎక్కించి హైదరాబాద్‌కు తరలించారు.
44వ జాతీయ రహదారిపై నున్న ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ప్రమాదానికి కారణమైన బస్సు, కెమికల్ యా సిడ్ ట్యాంకర్ నిలిచిపోవటంతో ట్రాఫీక్ స్తం భించింది. జడ్చర్ల సీఐ కమలాకర్ నేతృత్వంలో ట్రాఫిక్‌ను సర్వీసు రోడ్డు మీదుగా మళ్లీంచారు. కెమికల్ యాసిడ్ లోడ్ ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్‌లోకి కెమికల్‌ను తరలించారు. ఆ తర్వాత రోడ్డుపై ఉన్న బస్సు, ట్యాంకర్‌ను పక్కకు తొలగింపజేశారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు సంబందించిన వివరాలను అడిగి తెలసుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడినట్లు ఎస్పీ తెలిపారు. యాసిడ్ ట్యాంకర్ డ్రైవర్ జీ రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.