మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 16 : జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఇంటర్ కళాశాలలకు అఫిలియేషన్ రెన్యువల్ కాకపోవడం అ యోమయానికి గురిచేస్తోంది. ఇప్పటికే ఆయా కళాశాలలు ముందస్తు ప్రవేశాలు(ఆఫ్‌లైన్‌లో) తీసుకొని ఉండడంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిబంధనలు పాటించిన వాటికే అనుమతులు మంజూరు చేయ డం.. లేని వాటిని రెన్యువల్ కూడా అవకా శం ఇవ్వడం లేదు. ఈ విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ముగింపు దశ దగ్గర పడడంతో వాటికి అనుమతులు వస్తాయా.. రా వా..? అనేసందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో మౌలిక వసతులు సక్రమంగా లేకపోవడంతోనే వాటి అనుమతుల ప్రక్రియ ఇంకా పురోగతిలోనే ఉందా..? లేకా ఇతర కారణాలు ఉన్నా యా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ), ఆట స్థలం, గు ర్తింపుపత్రం, సరిపడా అధ్యాపకులు, సిబ్బం ది, అగ్నిమాపక అనుమతులు, ఫర్నీచర్, ఇతర మౌలిక వసతులు, అద్దె భవనమైతే సంబంధిత పత్రం తప్పనిసరిగా ఉం డాలి. ఇది వరకు కొన్ని లేకపోయినా.. ప్రభు త్వం అనుమతులు మంజూరు చేసింది. కానీ ఈ ఏడాది నిబంధనల పట్ల కఠినతరంగా వ్యవహరిస్తుండడంతో అనుమతుల ప్రక్రియ ఆలస్యమవుతున్నది. ఆయా కళాశాలలు అన్ని సమర్పిస్తేనే అనుమతులు మంజూరు చేస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
కొన్ని ప్రైవేట్ కళాశాలలు అనుమతుల విషయంలో స్పష్టత కొరవడింది. అనుమతి మంజూరు కాని కళాశాలలు జిల్లా కేంద్రంతోపాటు జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉన్నాయి. మరోవైపు కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమకు అనుమతి ఉదంటూ పత్రాలు చూపిస్తూ విద్యార్థులను తల్లిదండ్రులను బురిడీ కొట్టిం చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇం టర్ ప్రవేశాల గడువును ఈ నెల 30వ తేదీ వరకు విధించింది.
అప్పటి వరకు కళాశాల లు అనుమతులు తెచ్చుకుంటాయా? లేదా? అనేది అనుమానంగా మారింది. ఒకవేళ అనుమతి వస్తే సరేసరి.. లేదంటే విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడనుంది. అధికారుల పర్యవేక్షణ, ప్రచార లోపం అనుమతి లేని కళాశాలలకు కలిసివస్తోందనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు కొలువుండే చోటే ఆయా కళాశాలలు బహిరంగంగా అనుమతి లేకున్నా ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించడం పలు అనుమానాలు తావిస్తోం ది. కఠినంగా వ్యవరించడంలో అధికారులు మా మూలుగా తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 15 ఉన్నా యి. ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 38 ఉ న్నాయి. వీటిలో కేవలం 6 కళాశాలలకు మా త్రమే అఫిలియేషన్ ఉన్నది. 21 కళాశాలల దరఖాస్తులు అండర్ ప్రాసెస్‌లో ఉండ గా.. వాటిలో చాలా వరకు మిక్స్డ్ ఆక్యూపెన్సీ లో ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని మిడ్జిల్, హన్వాడ, కోయిలకొండ, బాలానగర్ మండలాలతోపాటు మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలో ఉన్న కొన్ని కళాశాలలు జిల్లావ్యాప్తం గా మొత్తం 11 కళాశాలలు దరఖాస్తులే సమర్పించలేదు. 2024-25 సంవత్సరంలోనూ జిల్లాలోని 9 కళాశాలలకు ఇంటర్‌బోర్డు ఒక్కో దానికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ. 9 లక్షలు జరిమానా విధించింది.
ఇంటర్ బోర్డు గుర్తిం పు రాకముందే అడ్మిషన్లు తీసుకుంటున్న ట్లు తెలిస్తే చర్యలు తప్పవు. ప్రైవేట్ కళాశాలలు నిబంధనల మేరకు వ్యవహరిస్తేనే ప్రభుత్వం అనుమతిస్తుంది. కొన్ని కళాశాలలు అఫిలియేషన్ రెన్యూవల్ కోసం దరఖాస్తులు సమర్పించాయి. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అనుమతులు రాకపోతే ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలకు ఉపక్రమిస్తాం.
– కౌసర్‌జహాన్, జిల్లా ఇంటర్ విద్యాధికారిణి, మహబూబ్‌నగర్