మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, జనవరి 4 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలికల బాత్రూంలో రికార్డింగ్ మోడ్‌లో మొబైల్‌ఫోన్ కన్పించడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో కళాశాలలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. మేడ్చల్‌లోని సీఎంఆర్‌లో విద్యార్థినుల హాస్టల్లో వీడియోల చిత్రీకరణ ఘటన మరువక ముందే పాలమూరులోనూ అలాంటి పరిస్థితులు నెలకొనడంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ.. కొందరు విద్యార్థి సంఘాల నాయకులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోనే విద్యార్థినుల బాత్రూంలు ఉన్నాయి. మూడో సంవత్సరం చదివే ఓ విద్యార్థిని బాత్రూంకు వెళ్లగా వారికి అక్కడ మొబైల్ కన్పించింది. ఈ విషయాన్ని తన స్నేహితులకు తెలపడంతో వారంతా కలిసి అటెండర్‌కు సమాచారం ఇచ్చి ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రిన్సిపాల్ తన సిబ్బందితో బాత్రూంలోని సెల్‌ఫోన్‌ను తన చాంబర్‌కు తీసుకొచ్చి ఈ విషయాన్ని షీటీం పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయంలో తీసుకునే చర్యలపై ప్రిన్సిపాల్ విద్యార్థినులకు పూర్తిస్థాయిలో భరోసానివ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థినులు అక్కడే బైఠాయించి ఆం దోళనకు దిగడంతోపాటు విద్యార్థి సంఘాల నాయకులకు ఘటన వివరాలు తెలిపారు. వారికి విద్యార్థి సంఘాల నేతల మద్దతు తెలుపడంతో ఆందోళన మరింత తీవ్రమైంది. ఒక దశలో పోలీసులకు విద్యా ర్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. బాధ్యులను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక నుంచి ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు, కాలేజ్ ప్రిన్సిపాల్ చర్య లు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బా త్రూంలో సెల్‌ఫోన్ మేం చూశాం కాబట్టి సరిపోయింది.. లేకుంటే ఎంతమంది సఫర్ అయ్యేవారో అని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఇక్కడ విద్యారిని, విద్యార్థులు పాలిటెక్నిక్ చేస్తుంటారు. ఈ సమస్య ఒక్క పాలమూరు జిల్లాకు సం బంధించింది కాదని రాష్ట్రవ్యాప్త సమస్య అంటూ విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా స్పందించి ఆందోళనకు దిగారు.
బ్యాక్లాగ్ పరీక్ష రాసేందుకు వచ్చిన థర్డ్ ఇయర్ విద్యార్థి బాత్రూంలో సెల్‌ఫోన్ పెట్టాడనే ఆరోపణలు రావడం, పరీక్ష ముగిసిన తర్వాత తన మొబైల్ మిస్ అయ్యిందని ఆ విద్యార్థి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయ డం.. ఆ మొబైల్లో ఉన్న ఏటీఎం ఆ విద్యార్థిదే కావడంతో షీటీం వాళ్లు ఆ విద్యార్థిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. మొబైల్లో వీడియోలు ఉన్నాయా..? ఉన్న వాటిని ఏమైనా డిలీట్ చేశారా..? అనే విషయాలను పోలీసులు వెల్లడించడం లేదు.
కళాశాల బాత్రూంలో సెల్‌ఫోన్ ఘటన విషయం తెలుసుకున్న కలెక్టర్ విజయేందిరబోయి, ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, జిల్లా అధికారులు ఘటనా స్థలాన్ని శనివారం సాయంత్రం పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బందితో వివరాలు సేకరించారు. సమగ్ర విషయాలపై పరిశీలించి చట్టపరమైన చర్యలకు సిఫారసు చేయాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు.
ఈ ఘటన జరగడం దురదుష్టకరం. కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి బాత్రూంలో మొబైల్ పెట్టి వీడియో రికార్డు చేయడం జరిగిందని ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థినుల స్టేట్మెంట్ రికార్డు చేసుకొని నిందితుడిపై కేసు న మోదు చేసి రిమాండ్‌కు తరలిస్తాం. గతంలోనూ ఇ లాంటి ఘటన చోటుచేసుకున్నట్లు విద్యార్థులు అం టున్నా పోలీసుల దృష్టికి తీసుకురాలేదు. విద్యార్థినులకు షీటీం సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. అమ్మాయిలను వేధిస్తున్నా.. ఇతర ఎ లాంటి ఘటన జరిగినా మా దృష్టికి తీసుకురావాలి.
బాత్రూంలో సెల్‌ఫోన్ చూసిన ఓ స్టూడెంట్ విషయాన్ని అటెండర్‌కు చెబితే మాకు సమాచారం అందించారు. మేము షీటీంకు సమాచారం ఇచ్చి.. మొబైల్లో ఉన్న ఏటీఎం ద్వారా పేరు తెలుసుకున్నాం.. మళ్లీ అదే విద్యార్థి పరీక్ష ముగిశాక నా ఫోన్ పోయిందంటూ ఫిర్యాదు చేయడంతో అతడిపై అనుమానంతో తాళం వేసి అతను బయటకు వెళ్లకుండా గేట్లు వేసి.. షీటీం కానిస్టేబుల్ రఘు ద్వారా విచారణ చేపట్టగా అతను ఒప్పుకున్నాడు. ఈ విషయంపై అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని పోలీసులను కోరాం.
– మోహన్‌బాబు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మహబూబ్‌నగర్