అయిజ, డిసెంబర్ 6 : కేసీఆర్ పదేండ్ల కాలంలో విద్యకు స్వర్ణయుగం తెచ్చారని, ఏడాది కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నదని జిల్లా గురుకుల బాట ఇన్చార్జి, బీఆర్ఎస్వీ నేత కుర్వ పల్లయ్య ఆరోపించారు. ఏడాది ప్రజాపాలనలో సీఎం రేవంత్‌రెడ్డి పాఠశాలలు, గురుకులాలను అధఃపాతాళానికి తొక్కి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నాడని దుయ్యబట్టారు. గురుకులబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అయిజ పట్టణంలోని కేజీబీవీ గురుకుల పాఠశాలను సందర్శించి, సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్న బీఆర్ఎస్వీ నాయకులను గేటు బయటనే అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా గురుకుల బాట ఇన్చార్జి కుర్వ పల్లయ్య మాట్లాడుతూ శాంతియుతంగా గురుకులాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసునేందుకు వెళ్తున్న తమను ముందస్తుగానే పోలీసులతో అడ్డుకొని గురుకులాల్లో నెలకొన్న సమస్యలు బహిర్గతం కాకుండా ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుండా విద్యార్థులను పొట్టనపెట్టుకుంటుందన్నారు. ప్రజాపాలనలో ప్రజాప్రతినిధులు, అధికారులు తనిఖీ చేయకుండా నాణ్యమైన విద్య, భోజనం ఏ విధంగా అందుతుందన్నారు.
ఎల్లవేళలా అధికారులు, ప్రజాప్రతినిధులు తనిఖీలు చేస్తేనే వంట ఏజెన్సీలు నాణ్యమైన భోజనం అందిస్తారని, అలా కాకుండా ప్రభుత్వమే తనిఖీలు చేయకుండా విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంటుందన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను బలితీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు గురుకులాల్లో విద్యాభ్యాసం చేస్తున్న 48మంది విద్యార్థులను పొట్టనపెట్టుకుందని విమర్శించారు. గురుకులాలను సందర్శిస్తే సీఎం ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
గురుకులాల్లోని సమస్యలు ఎక్కడ బహిర్గమవుతాయోనని భయం పట్టుకుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉందని, ఆ హక్కులను కాలరాసే హక్కు ఎవరికీ లేదన్నారు. పోలీసులతో నిర్బంధాలను విరమించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. అనంతరం సొంత పూచీకత్తుపై నాయకులను విడుదల చేశారు. అలాగే మండలంలోని ఉప్పల జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు మత్తాలి, కుర్వ వీరేశ్, మాధవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.