వనపర్తి, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే దురాశతో నక్సలైట్‌నని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ , డీఎస్పీ వెంకటేశ్వర రావుతో కలిసి శుక్రవారం వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిరెడ్డిపల్లికి చెందిన తిప్పిరెడ్డి సుదర్శన్‌రెడ్డి అలియాస్ ప్రమోద్‌రెడ్డి మావోయిస్టు అవతారమెత్తాడు.
వనపర్తి జిల్లాలోని రైస్‌మిల్ అసోయేషన్ జిల్లా అధ్యక్షుడు ఖిల్లాఘణపురం మండలం సోలీపూర్‌కు చెందిన శేఖర్‌రెడ్డికి ఫోన్ చేసి రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని బెదిరించాడు. అక్టోబర్ 2వ తేదీన బెదిరించి ఖాతాలోకి రూ.8 వేలు వేయించుకున్నాడు. మళ్లీ డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో శేఖర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు ఖిల్లాఘణపురం బస్టాండ్ సమీపంలో సుదర్శన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.
అతడి వద్ద నుంచి మొబైల్ ఫోన్, రూ.6 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై ఇప్పటికే నేరచరిత్ర ఉన్నదని, 12 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని హబ్సీగూడ అపార్ట్మెంట్లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆత్మరక్షణ పేరుతో గన్ లైసెన్స్ తీసుకొని రివాల్వర్ కొని దానిని చూపించి చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసేవాడు.
ఆ వచ్చిన డబ్బులను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టగా నష్టాలు రావడంతో ఇలా తప్పుడు పనులకు తెరలేపాడు. పెద్దపల్లి జిల్లాలోని ఓ రైస్‌మిల్ యజమాని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. అలాగే కరీంనగర్, సుబేదారి, మిర్యాలగూడ, సుల్తానాబాద్ తదితర ప్రాంతాల్లో డబ్బుల వసూళ్ల కేసుల్లో జైలు పాలయ్యాడని ఎస్పీ వెల్లడించారు. కాగా, ఈ కేసును ఛేదించిన కొత్తకోట సీఐ రాంబాబు, ఎస్సై సురేశ్, కానిస్టేబుల్స్ లింగం, రాజులను ఎస్పీ అభినందించారు.
సెలవుల్లో ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ ఇండ్ల యజమానులకు సూచించారు. ఇండ్లకు తాళాలు వేసి ఇంట్లో బంగారం, నగదు ఉంచి గ్రామాలకు వెళ్లడం సరియైనది కాదన్నారు. ఇండ్లలో ఎవరూ లేనప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలని, పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలని, బైక్, కార్లు ఆవరణలోనే పార్కింగ్ చేయాలని, వాహనాల్లో విలువైన వస్తువులను ఉంచకూడదన్నారు. నగలు, నగదును బ్యాంకుల్లో ఉంచాలని లేకపోతే మీ వెంట తీసుకువెళ్లాలన్నారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలని, ప్రజలు పోలీసులకు సహకరించడంతో చోరీలను నియత్రించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు.