మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 13 : క్రీడలపై ఆసక్తి ఉన్నవారు శిక్షకులుగా రాణించాలని ఆశించేవారికి అపారమైన అవకాశాలు ఉన్నాయని టీజీ పీఈ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దిలీప్‌కుమార్ అన్నారు. టీజీ పీఈ -సెట్ 2025 ఎంపికల్లో భాగంగా పాలమూరు యూనివర్సిటీలో కొనసాగుతున్న ఫిజికల్ ఎఫిషియోన్సీ టెస్ట్, స్కిల్ టెస్టులు శుక్రవారం సెట్ కన్వీనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు సంబంధించి విద్య, పరిశోధన, శిక్షణల్లో ఆధునికత దిశగా అడుగులు వేయాలని సూచించారు. స్పోర్ట్స్ కోచ్‌లకు వారి నైపుణ్యాలను అనుసరించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో డిమాండ్ ఉందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సంబంధిత క్రీడా శిక్షకులుగా రాణించవచ్చన్నారు. ఫిట్నెస్ సెంటర్లలో మేనేజర్‌గా ఎదగవచ్చు. ప్రైవేట్ క్రీడా కేంద్రాల్లో స్పోర్ట్స్ కోచ్‌గా అవకాశాలు అందుకోవచ్చు. క్రీడాకారులకు మెంటర్‌గా వ్యవహరించవచ్చు.
క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, లక్ష్యం దిశగా అడుగులు పడేలా ప్రోత్సహించేది మీరే అని ఉద్ఘాటించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్పోర్ట్స్ అకాడమీలు, శిక్షణా కేంద్రాల్లో అవకాశాలుంటాయని, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో స్పోర్ట్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్‌గా రాణించవచ్చన్నారు. అంతకు ముందు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ షేక్ మహమ్మద్ గాల్లోకి కాల్పులు జరిపి పరుగుపందెం పోటీలను ప్రారంభించారు. పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాట్లు బాగున్నాయని కితాబు ఇచ్చారు.
ఒకప్పుడు కరవు జిల్లాగా ఉన్న పాలమూరు ఈ రోజు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుండటం ఎంతో అభినందనీయం అని పేర్కొన్నారు. పీయూ వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ బీపెడ్, డీఎడ్లలో అడ్మిషన్లు పొందాలంటే టీజీ పీఈ సెట్లో అర్హత సాధించాల్సి ఉంటుందన్నారు. మూడో రోజు బీపెడ్లో 403 మంది విద్యార్థులకు గానూ 248 మంది, డీపెడ్ కోర్సులో 132మందికి గాను 75మంది విద్యార్థులు హాజరయ్యారని పీయూ ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమాల్లో పీయూ రిజిస్ట్రార్ పూస రమేశ్‌బాబు, దీప్లనాయక్, పీయూ పీఆర్వో శేకుంటి రవికుమార్, అధ్యాపకులు, డా.జ్ఞానేశ్వర్, వెంకటేశ్‌యాదవ్, అర్జున్‌కుమార్, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల పీడీ సత్యభాస్కర్‌రెడ్డి, జిల్లా ప్రధాన స్టేడియం కోచ్ సునీల్, తదితరులు పాల్గొన్నారు.